మోడీ కోసం దేశం పరుగు

 

ఒకప్పుడు బస్టాండులో టీ అమ్ముకొన్న నరేంద్ర మోడీ తన తెలివి తేటలతో గుజరాత్ ముఖ్యమంత్రి కాగలిగాడు. అదే వ్యక్తి ఇప్పుడు బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా ఎదిగాడు. ఒకనాడు ఆయన అభ్యర్ధిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేఖించిన అద్వానీ వంటి వారు కూడా నేడు ఆయనను పొగుడుతున్నారు. ఎక్కడో గుజరాత్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండే ఆయన, బీజేపీ ఎన్నికల సారధ్య బాధ్యతలు చేప్పట్టి గట్టిగా మూడు నాలుగు నెలలు కూడా కాలేదు. అయినప్పటికీ, ఇటీవల మూడు రాష్ట్రాలలో బీజేపీ సాధించిన ఘన విజయం, డిల్లీలో కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టగలిగారు. ఇది నిజంగా ఆయన ఘనతేనని అంగీకరించక తప్పదు.

 

సరిగ్గా రాహుల్ గాంధీ కి పట్టాభిషేకం చేయాలని కాంగ్రెస్ భావిస్తున్న తరుణంలో ఆయన అకస్మాత్తుగా బీజేపీ ప్రధానిగా ఊడిపడటంతో ఉలిక్కి పడిన కాంగ్రెస్ పార్టీ ఆయనను బూచిగా చూపించి రాహుల్ గాంధీకి అడ్డులేకుండా చూసుకోవాలని ప్రయత్నం చేసేది. కానీ  ఉగ్రవాదుల దాడులను, చైనా చొరబాట్లను, అధిక ధరలను, అరికట్టలేని కాంగ్రెస్ అసమర్దతను ఎండగడుతూ, అవినీతి వ్రేళ్ళూనుకుపోయిన కాంగ్రెస్ పార్టీనే ఆయన బూచిగా చూపెట్టి ఎన్నికలలో ఘన విజయం సాధించగలిగారు.

 

కాంగ్రెస్ పార్టీలో గల్లీ నుండి డిల్లీ వరకు అందరి బేషరతు మద్దతు గల రాహుల్ గాంధీ ఈ ఎన్నికల ప్రచారంలో చతికిలపడిపోగా, మోడీ స్వయంగా దేశంలో మెజార్టీ ప్రజల వ్యతిరేఖతను ఎదుర్కొంటూ, మతతత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీని గెలిపించుకోవడం ఆయన సమర్ధతకు, రాజకీయ నైపుణ్యానికి అద్దంపడుతోంది.

 

పనిలోపనిగా ఆయన ప్రజలలో తనపట్ల ఉన్న వ్యతిరేఖతను కూడా క్రమంగా తగ్గించుకొనే ప్రయత్నాలు చాలా గట్టిగానే చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ‘యూనిటీ రన్’ పేరుతో ప్రజలకు తనకూ మధ్య దూరం తగ్గించుకొనే ప్రయత్నం చేసారు. దేశ ఐఖ్యత కోసం అనగానే సహజంగానే ప్రజలు అటువంటి కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతారు. పార్టీలకు, జెండాలకి అతీతంగా ప్రజలందరూ పాల్గొనేలా చేయడమే కాకుండా, దీనిపై కాంగ్రెస్ పార్టీ నోరెత్తలేని పరిస్థితి విధంగా చక్కటి వ్యూహం అమలు పరిచారు.

 

నిజానికి ఇది ఆయన తనను తాను ప్రజలలో ప్రమోట్ చేసుకోవడానికే ఉద్దేశ్యించబడిన కార్యక్రమమని అందరికీ తెలుసు. కానీ, ఆయన దేశ ఐఖ్యత కోసం పరుగు అంటూ దానికి మహనీయుడు సర్దార్ వల్లభభాయి పటేల్ పేరుని కూడా జోడించడంతో దానికి ఊహించినట్లే దేశవ్యాప్తంగా ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. ఆయన దీనిని ఒక బీజేపీ కార్యక్రమంగా రూపొందించి ఉంటే, ఇంత స్పందన ఉండేది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును. కానీ, ఆయన ఎక్కడా తన పేరు, పార్టీ ప్రసక్తి తేకుండా ‘దేశంకోసం’ అంటూ అందరినీ తన మాట మీద పరుగులెత్తించగలిగారు. అంతే గాకుండా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తనని, తన పార్టీని స్మరించుకోనేలా చేసారు. ఆయనలో గల ఈ నేర్పే రేపు డిల్లీకి బాటలు పరుస్తుందేమో కూడా!