ఘోర రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రికి తీవ్ర గాయాలు.. భార్య, పీఏ మృతి

కర్నాటకలోని అంకోలాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఆయన భార్య విజయతో పాటు ఆయన పీఏ దీపక్‌ మృతి చెందారు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన వారిద్దరిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ వీరిద్దరూ చనిపోయారు. ఎల్లాపూర్‌ నుండి గోవా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మంత్రి శ్రీపాద నాయక్‌‌కు తీవ్ర గాయాలు కావడంతో.. ఆయన్ను హుటాహుటిన గోవా మెడికల్‌ కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రికి గోవా సీఎం ప్రమోద్ సావంత్ వెళ్లి మంత్రి ఆరోగ్య పరిస్థితి తోపాటు ఆయనకు అందిస్తున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మరోపక్క కారులో ఉన్న డ్రైవర్‌, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇది ఇలా ఉండగా ఈ ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. నాయక్‌కు మెరుగైన వైద్యం అందేలా చూడాలని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌కు సూచించారు.

 

ఈ ప్రమాదం పట్ల కర్ణాటక సీఎం యడియూరప్ప తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శ్రీపాద నాయక్ భార్య విజయ మృతిపట్ల ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ సంతాపం తెలిపారు. 68 ఏళ్ల శ్రీపాద నాయక్‌ ఉత్తర గోవా నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఆయుష్‌ మంత్రిగా, రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కర్నాటక సీఎం యడ్యూరప్ప, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో ఫోన్లో మాట్లాడారు. కేంద్రమంత్రి శ్రీపాదకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు.