TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీనగర్ ఎయిర్ పోర్ట్‌‌ను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Published on: Thu May 15, 2025 4:32PM

 

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి  కింజారపు రామ్మోహన్ నాయుడు శ్రీనగర్ విమానాశ్రయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ఇటీవల పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితులలో కూడా అప్రమత్తంగా సేవలందించిన విమానాశ్రయ సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రయాణీకుల భద్రతను ప్రాధాన్యతగా తీసుకుని, వారిలో భయం లేకుండా నిరంతరంగా సేవలందించిన తీరును మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు. భద్రతా దళాలు, జమ్మూ & కాశ్మీర్ పోలీసులు, అలాగే విమానాశ్రయ అధికారులు సమర్థవంతంగా సమన్వయం చేసుకోవడం వల్ల ప్రయాణీకులను సురక్షితంగా తరలించగలిగామని ఆయన పేర్కొన్నారు. 

విమానాశ్రయంలో అందించిన సహాయక చర్యలు, భద్రతా ఏర్పాట్లు మరియు మౌలిక సదుపాయాల పట్ల మంత్రి అభినందనలు తెలియజేశారు. గత కొన్ని రోజులుగా నిలిపివేయబడిన విమాన సర్వీసులను నేడు శ్రీనగర్ నుండి మళ్లీ పునః ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.అలాగే, శ్రీనగర్‌లోని ప్రసిద్ధ లాల్ చౌక్ వద్ద ఉన్న పోలో వ్యూ మార్కెట్‌ను కూడా సందర్శించారు. మంత్రి రామ్మోహన్ నాయుడు నడుచుకుంటూ వెళ్లి స్థానిక దుకాణదారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఈ ప్రాంతంలో సాధారణ పరిస్థితులను తీసుకురావడానికి మరియు పర్యాటకాన్ని మరల ఆకర్షించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ గురించి వారికి హామీ ఇచ్చారు.శ్రీనగర్ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు మరింత సురక్షితమైన, సౌకర్యవంతమైన అనుభవం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.