పంజాబ్‌లానే తెలంగాణలోనూ.. అంతా కేసీఆరే చేస్తున్నారంటూ కేంద్రమంత్రి ఫైర్..
Published on: Thu Mar 24, 2022 5:10PM
వరి రాజకీయం ఢిల్లీకి తాకింది. తెలంగాణలో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తుండటంతో.. హస్తినలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. తెలంగాణపై వివక్ష ఏమీ లేదని స్పష్టం చేశారు. అంతా కేసీఆరే చేస్తున్నారంటూ విమర్శించారు.
అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ నుంచి ముడి బియ్యం (రా రైస్) సేకరిస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అయితే కేంద్రానికి ముడి బియ్యం ఎంత ఇస్తారని ఎన్నిసార్లు అడిగినా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం లేదని ఆరోపించారు. తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలు రా రైస్ ఎంత ఇస్తాయో చెప్పాయన్నారు. ఒప్పందం ప్రకారమే ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేయనున్నట్టు.. ముడిబియ్యం సేకరణకు తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు.
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి వివక్ష లేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ నేతలు కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను తెలంగాణ సర్కార్ తప్పుదోవ పట్టిస్తోందని.. కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో పంజాబ్‌తో అనుసరిస్తున్న విధానమే తెలంగాణలోనూ అమలు చేస్తామని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. పంజాబ్, తెలంగాణ.. రెండు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి సమానమేనని.. తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం బాసటగా ఉంటుందన్నారు.


