TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జనవరి 31 నుంచి బడ్జెట్ సమావేశాలు.. ఫిబ్రవరి 1న బడ్జెట్

Published on: Tue Jan 3, 2023 11:51AM

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం కానున్నాయి.  2023-24 వార్షిక బడ్జెట్ ను కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నారు. సమావేశాల మొదటి రోజు అంటే జనవరి 31న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజు ఆర్థిక సర్వే నివేదికను ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్ట నుంది  బడ్జెట్‌ సమావేశాలను రెండు విడతలుగా నిర్వహించనుంది.

మొదటి సెషన్‌ జనవరి 31నుంచి ఫిబ్రవరి 10వరకూ,  రెండో  సెషన్‌ మార్చి 6నుంచి ఏప్రిల్‌ 6 వరకు జరుగుతుందని కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. కాగా పార్లమెంట్ బడ్జెట్ సెషన్ తొలి విడతలో   రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చేసే తీర్మానంపై  సభ్యులు ప్రసంగాల అనంతరం తీర్మానాన్ని ఆమోదిస్తారు.  అలాగే ఫిబ్రవరి 1న విత్తమంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై చర్చ ఉంటుంది. చర్చ అనంతరం విత్త మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇస్తారు.  .రెండో విడత బడ్జెట్‌ సమావేశాల్లో వివిధ మంత్రిత్వ శాఖలకు నిధుల కేటాయింపులపై చర్చ జరుగుతుంది. బడ్జెట్‌కు సభ ఆమోదం తెలుపుతుంది.  

పార్లమెంటు కొత్త భవనం సెంట్రల్‌ విస్టా పనులు చురుగ్గా సాగుతున్నాయి.  బడ్జెట్ రెండో విడత సమావేశాలను  సెంట్రల్‌ విస్టా హాలులోనే నిర్వహించేందుకు వీలుగా చర్యలు  ఏర్పాట్లు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.