బీజేపీ గతుక్కుమంది.. వెతుకులాటలో పడింది

నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నాయకులది ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది. అధికారాన్ని ఆస్వాదిస్తూనే మిత్రధర్మాన్ని విస్మరించింది. అధికారంలో వుంటూనే అధికార పార్టీని విమర్శిస్తూ వచ్చింది. బీజేపీతో స్నేహాన్ని కొనసాగించడం మినహా మరో గత్యంతరం లేని టీడీపీ నాయకులు బీజేపీ నాయకుల వ్యవహారశైలిని మౌనంగా భరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను కోరుకుంటూ వారి దూకుడును సహించారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొండిచెయ్యి చూపడంతో టీడీపీ నాయకుల సహనం కట్టలు తెంచుకుంది. బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు గళం విప్పడం ప్రారంభించారు.

 

టీడీపీ ఎంపీలు గత కొద్ది రోజులుగా పార్లమెంటులో వ్యక్తం చేస్తున్న నిరసన బీజేపీ నాయకత్వం ఎంతమాత్రం ఊహించని పరిణామం. అలాగే ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంటులో వినిపించిన నిరసన గళం బీజేపీకి తిరుగులేని వార్నింగ్. మోడీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ విషయంలో అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణిని, మిత్రద్రోహాన్ని ఆ ప్రసంగం ప్రశ్నించింది. ఇప్పటి వరకూ టీడీపీ నాయకులు కుక్కిన పేనుల్లా పడి వున్నారని అనుకుంటూ వచ్చిన బీజేపీ నాయకులను ఈ పరిణామాలన్నీ గతుక్కుమనిపించాయి. ఇప్పుడు టీడీపీని ఎలా ఎదుర్కోవాలా అనే వెతుకులాటలో బీజేపీ నాయకులు పడిపోయారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికే బోలెడన్ని నిధులు ఇచ్చాము. ఫలానా ఫలానా పథకాలకు వినియోగిస్తున్న డబ్బు కేంద్రం ఇచ్చిందే అని చెప్పడానికి ఏపీ బీజేపీ నాయకులు సమాయత్తం అవుతున్నారు. విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో పడిన ఏపీని బీజేపీ ప్రభుత్వం అనేక రకాలుగా ఆదుకోవడం వల్లే ప్రస్తుత పరిస్థితి ఇలాగైనా వుందని చెప్పడానికి బీజేపీ నాయకులు సన్నాహాలు చేసుకుంటున్నారు. మొత్తమ్మీద వచ్చే ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీల మధ్య స్నేహం అటూ ఇటూ అయినా జనంలో బీజేపీ పలుచన కాకుండా వుండేలా చూసుకోవాలి. దీనికోసం ఏం చేయాలనా అని బీజేపీ నాయకులు సమాలోచనలు చేస్తున్నారు. ఏపీ ప్రజల్లో ఇప్పటికే బీజేపీ మీద బాగా వ్యతిరేకత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తమ పార్టీ మీద ప్రజలకున్న వ్యతిరేకతను టీడీపీ వైపు మళ్ళించడానికి ఏం చేయాలన్న చర్చలు కూడా బీజేపీలో జరుగుతున్నాయి.