తెలుగు హీరోలకి ఏపీ ప్రజలపై బాధ్యత లేదా..?

"దూరపు కొండలు నునుపు" అని మన పెద్దలు వూరికే అనలేదు. కేంద్రప్రభుత్వం జల్లికట్టుపై నిషేధం విధించిన వేళ.. మన పక్క రాష్ట్రం తమిళనాడులో ప్రజలంతా ఆందోళనకు దిగితే.. పెద్ద హీరో, చిన్న హీరో అన్న తేడా లేకుండా కోలీవుడ్ మొత్తం రోడ్ల మీదకు వచ్చింది. చిన్నప్పటి నుంచి మాకు మద్రాస్‌తో అనుబంధం ఎక్కువని.. తెలుగు హీరోలు కూడా తమిళ జనాలకు మద్దతు ప్రకటిస్తూ.. పోటీలు పడి ట్వీట్లు చేశారు. ఇంకొందరైతే మరో అడుగు ముందుకేసి ప్రెస్ మీట్లు పెట్టి మరి సపోర్ట్ చేశారు. భారతీయులుగా ఇరుగు పొరుగుకి మద్దతు తెలపడంలో ఏమాత్రం తప్పులేదు. కానీ ఇంట గెలిచి రచ్చ గెలవాలనే చిన్న సూక్తిని తెలుగు హీరోలు విస్మరించారు.

 

2018-19 బడ్జెట్‌లో కేంద్రప్రభుత్వం ఏపీకి చేసిన దారుణమైన అన్యాయానికి సీమాంధ్ర రగిలిపోతోంది. ప్రజల ఆవేదనను నాలుగు రోజుల నుంచి ఎంపీలు పార్లమెంట్‌లో వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మీరేం చేశారని ప్రధాని మోడీని ఉభయసభల్లో కడిగిపారేస్తున్నారు. అయినా కేంద్రప్రభుత్వం చీమకుట్టినట్లు కూడా లేకుండా తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. సహజంగానే యువత సోషల్ మీడియా ద్వారా కేంద్రంపై పోరాటానికి దిగింది. ఇంత జరుగుతున్నా.. తెలుగు హీరోలెవరూ నోరు మెదపకపోవడం ఐదు కోట్ల ఆంధ్రులకు మింగుడు పడటం లేదు.

 

మీడియా ముందు కొచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు.. కానీ మద్ధతుగా ఒక్క ట్వీట్ చేస్తే చాలు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌, యువ హీరో నిఖిల్ మాత్రమే ఇప్పటి వరకు స్పందించిన వారిలో ఉన్నారు. పవన్‌ రాజకీయపార్టీ అధినేత కాబట్టి ఆయనకు తప్పదు.. ఇక నిఖిల్ చిన్న హీరో.. అతనికి ఉన్న ధైర్యం చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లకు లేదా..? పైన చెప్పిన వారి మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లోనివే. ఒకరకంగా వారంతా ఆంధ్రులే.. తోటి ఆంధ్రులు తలోక రూపాయి వేసి సినిమా చూడబట్టే.. స్టార్ స్టేటస్, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా.. వీరికి గుర్తింపు వచ్చాయన్న విషయాన్ని మన ఘనత వహించిన హీరోలు మరచిపోయినట్లు ఉన్నారు. అయినా ఇది కొద్దిరోజులే కదా.. తర్వాత మరచిపోతారని హీరోలు అనుకుంటే పొరపాటే. ప్రజలు అంత తెలివి తక్కువోళ్లు కాదు. టైమ్ వచ్చినప్పుడు లెక్కలన్నీ బయటికి తీసి బదులు తీర్చుకుంటారు.. తస్మాత్ జాగ్రత్త.!!