ఏపీకి కావల్సింది మస్కా కాదు.. మనీ!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అమాయకులు, చేతగానివాళ్ళు, మస్కాకొడితే పడిపోయేవాళ్ళని అనుకుంటున్నట్టున్నారు. అందుకే పార్లమెంటులో ఆయన చేసిన ప్రసంగంలో ఏపీ ప్రజల్ని మస్కా కొట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ చేతిలో, బీజేపీ చేతిలో... ముఖ్యంగా మోడీ చేతిలో దారుణంగా మోసపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రస్తుతం మస్కాలకు పడిపోయే స్థితిలో లేరు. ఏపీ ప్రజలకు ఇప్పుడు కావల్సింది మస్కా కాదు... మనీ.

 

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా ప్రధాని మోడీ పార్లమెంటులో సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. సదరు ప్రసంగంలో ఆయన రాష్ట్రపతికి ధన్యవాదాలు చెప్పే అంశం మీద తక్కువ దృష్టి పెట్టారు.. కాంగ్రెస్ పార్టీని తిట్టి పోయడం మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. దేశం ఇప్పుడున్న దుస్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణం అన్నట్టు మాట్లాడారు. బీజేపీ పాలన అద్భుతంగా జరిగిందన్నట్టు చెప్పుకొచ్చారు.. పనిలోపనిగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలని మస్కా కొట్టే ప్రయత్నం చేశారు.

 

మొన్నటి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి మొండి చెయ్యి చూపించింది. అడ్డగోలు విభజనతో ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ మీద కొంచెం కూడా కనికరం లేకుండా కేంద్రప్రభుత్వం వ్యవహరించింది. ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మోడీ మీద నిరసన గళం వినిపిస్తోంది. ఏపీలో ఇప్పుడు పూర్తి స్థాయి వ్యతిరేకత కనిపిస్తోంది. పార్లమెంటులో కూడా ఏపీ పార్లమెంట్ సభ్యులు పట్టు వదలకుండా తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్లమెంటులో ప్రసంగించిన మోడీ తనదైన శైలిలో తెలివితేటలు చూపించారు. ఆంధ్రప్రదేశ్ విభజనని అడ్డగోలుగా, పార్లమెంటు తలుపులు మూసేసి చేశారని విమర్శించారు. అడ్డగోలు విభజన కారణంగా ఇప్పటికీ సమస్యలు ఏపీని వేధిస్తున్నాయన్నారు. టి.అంజయ్యకి జరిగిన అవమానాన్ని చూసి భరించలేకే ఎన్టీ రామారావు సినిమా కెరీర్‌ని వదలి రాజకీయాల్లోకి వచ్చారని చెప్పుకొచ్చారు.

 

పార్లమెంటు ప్రసంగంలో మోడీ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తీసుకురావడం ఏపీ ప్రజలను మస్కా కొట్టడానికేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే మోడీ మస్కాలకు లొంగే స్థితిలో ఏపీ ప్రజలు లేరు. మోడీ దగ్గర ఆస్కార్ అవార్డు లెవల్ హావభావాలు వుంటే వుండొచ్చు. అయితే ఆ నటనా చాతుర్యాన్ని చూసి ఆనందించే పరిస్థితి ఏపీ ప్రజలకు ప్రస్తుతం లేదు. అందువల్ల మోడీడీ... ఏపీ ప్రజలకు కావలసింది మస్కా కాదు.. మనీ.. ముందు ఆ సంగతి చూడండి!