TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

10లక్ష‌ల నిరుద్యోగులు.. 80వేల ఉద్యోగాలు.. గుడ్‌న్యూస్ ఎవ‌రికి కేసీఆర్‌?

Published on: Wed Mar 9, 2022 10:40AM

91,142 ఉద్యోగాలు. అందులో 80,039 పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు. అన్నిర‌కాల ఉద్యోగాలు. అటెండ‌ర్ నుంచి ఆర్డీవో వ‌ర‌కు.. 95 శాతం స్థానికుల‌కే ఉద్యోగాలు. మంగ‌ళ‌వారం టీజ‌ర్ వ‌దిలి మ‌రీ.. బుధ‌వారం గొప్ప‌గా ప్ర‌క‌టించారు సీఎం కేసీఆర్‌. 

ఉద్యోగాల జాత‌ర‌తో గులాబీ బాస్‌తో పాటు గులాబీ ద‌ళం తెగ ఖుషీ అవుతోంది. ఈ దెబ్బ‌తో త‌మ‌ ద‌శ తిరిగిపోతుంద‌ని.. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు తిరుగులేద‌ని అనుకుంటున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ, వైఎస్సార్‌టీపీ పార్టీలు ప‌దే ప‌దే విమ‌ర్శించే.. "ఉద్యోగాలు ఏవి కేసీఆర్‌".. "నిరుద్యోగుల ఆత్మ‌హ‌త్య‌లు క‌నిపించ‌వా కేసీఆర్‌".. లాంటి డైలాగ్‌లు ఇక‌పై వినిపించ‌వ‌ని అనుకుంటున్నారు. నిరుద్యోగ దీక్ష‌లు.. నిరుద్యోగ దండోరాలు.. ఇకపై క‌నిపించ‌వ‌ని భావిస్తున్నారు. కానీ.. కేసీఆర్‌కు అంత సీన్ లేద‌నే విష‌యం లేట్‌గా అయినా తెలిసిరావ‌డం ఖాయ‌మంటున్నారు. 

కావొచ్చు.. నిరుద్యోగుల పేరుతో ప్ర‌తిప‌క్షాల రాజ‌కీయం ఆగిపోవ‌చ్చు.. ధ‌ర్నాలు, దీక్ష‌లు ఉండ‌క‌పోవ‌చ్చు.. కానీ.. కేసీఆర్ త‌ల‌చిన‌ట్టు.. ఈ ఉద్యోగాల జాత‌ర‌తో నిరుద్యోగుల్లో ఆనందం మాత్రం పొంగిపొర్లక పోవ‌చ్చు. అందుకే, రోడ్ల మీద‌కు వ‌చ్చి సంబ‌రాలు.. పాలాభిషేకాలు చేయ‌ట్లేదు. అలా చేస్తున్న‌దంతా గులాబీ కేడ‌రే కానీ.. అస‌లైన నిరుద్యోగులు కారు. ఎందుకంటే వారిలో ఏడేళ్లుగా ఆగ్ర‌హం గూడుక‌ట్టుకుంది. ప్ర‌భుత్వ‌ ఉద్యోగాల కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూశారు. ఆక‌లి చావులు.. ఆత్మ‌హ‌త్య‌ల‌కు లెక్కే లేదు.. లెక్క‌కు రానీయ‌లేదు. 

ఏడేళ్లు ప‌స్తులు పెట్టి.. నిరుద్యోగుల బ‌తుకులు ఆగ‌మాగం చేసి.. అనేక మంది చ‌చ్చాక‌.. ప‌లువురు నిరుద్యోగులు ప్రాణాలు విడిచాక‌.. అనేక కుటుంబాలు రోడ్డున ప‌డ్డాక‌.. ఇప్పుడా ఉద్యోగాలు ఇచ్చేది? ఈ ఖాళీల‌న్నీ ఇప్పుడే క‌నిపించాయా? ఇన్నాళ్లూ ఏమై పోయాయి ఈ జాబ్‌లు? అని ప్ర‌శ్నిస్తున్నారు విద్యావంతులు. 

తెలంగాణ సాధించుకున్న‌దే నియామ‌కాల కోసం. అలాంటిది ఏడేళ్ల‌లో పోలీస్ రిక్రూట్‌మెంట్ మిన‌హా మ‌రే ఒక్క డిపార్ట్‌మెంట్‌లో ఖాళీలు భ‌ర్తీ చేయ‌లేదు. అలా ఏడేళ్లు కాలం గ‌డిపేశారు. తెలంగాణ రాష్ట్రం వ‌చ్చే నాటికే 3 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ‌ని అన్నారు. ఈ ఏడేళ్ల‌లో అనేక మంది రిటైర్ అయి ఉంటారు. ఆ లెక్క‌న‌.. ఎన్ని ల‌క్ష‌ల ఉద్యోగ ఖాళీలు ఉండి ఉంటాయి? మ‌రి, అవ‌న్నీ ఏమైపోయాయి? 80 వేల‌కే స‌రిపెట్టారు? మిగ‌తా పోస్టుల సంగ‌తేంది? ఎవ‌రికి బిచ్చం ఏస్తున్నారు? ఈ ఏడేళ్ల‌లో.. తెలంగాణ‌లో క‌నీసం 10 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులు త‌యార‌య్యారని లెక్క‌లు చెబుతున్నాయి. మ‌రి, ఇంత భారీగా.. ఏకంగా 10 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులుంటే.. ఇప్పుడు ఇచ్చే 80వేల ఉద్యోగాలు ఏ మూల‌కు? ఎవ‌రి మెహ‌ర్బానీ కోసం? ఎవ‌రి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం? అని ప్ర‌శ్నిస్తున్నారు నిరుద్యోగులు. 

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కేసీఆర్ గ్రాఫ్ దారుణంగా ప‌డిపోయింది. అన్నిరంగాల్లో టీఆర్ఎస్ స‌ర్కారు ఘోరంగా విఫ‌ల‌మైంది. కేసీఆర్‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త నెల‌కొంది. మ‌రీ ముఖ్యంగా నిరుద్యోగులు ఆయ‌న‌పై కోపంతో, ఆవేశంతో ర‌గిలిపోతున్నారు. ఇస్తాన‌న్న నిరుద్యోగ భృతి ఇవ్వ‌ట్లేదు. ఉద్యోగాల ఊసే లేదు. అందుకే, ఆ క‌డుపుమంట‌లో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ స‌ర్కారును ద‌హ‌నం చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు నిరుద్యోగులు. ఆ విష‌యం గులాబీ బాస్‌కు తెలియంది కాదు.. ఆ.. ఏం చేస్తారులే అని ఇన్నాళ్లూ లైట్ తీసుకున్నారు. కానీ, ప్ర‌శాంత్ కిశోర్ ఎంట్రీ త‌ర్వాత‌.. ఆయ‌న ఇచ్చిన స‌ర్వే నివేదిక‌లు చూశాక‌.. కేసీఆర్ కంగు తిన్నార‌ని అంటున్నారు. దారుణ ప‌రాభ‌వం, ప‌రాజ‌యం త‌ప్ప‌దని తెలుసుకొని.. హ‌డావుడిగా.. ఇప్పుడిలా.. 91,142 ఉద్యోగాలు అంటూ.. 80,039 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చారు. అయినా, కేసీఆర్‌కు నిరుద్యోగులు జేజేలు కొట్ట‌డం క‌ష్ట‌మే. ఏడేళ్లుగా అంత‌టి క‌డుపుమంట మ‌రి. ఆక‌లి చావులు మ‌రి. ఏడేళ్లుగా ఉద్యోగాలు ఇవ్వ‌కుండా ఆక‌లితో అల‌మ‌టించేలా చేసి.. ఇప్పుడు 80వేల జాబుల‌తో ధ‌మ్ బిర్యానీ పెడ‌తానంటే.. పండుగ చేసుకునేంత అమాయ‌కులేమీ కాదు తెలంగాణ‌ నిరుద్యోగులు. ఆక‌లి వేసిన‌ప్పుడే.. ప‌చ్చ‌డి అన్నం పెట్టినా ప్ర‌యోజ‌రం, ఉప‌యోగం ఉంటుంది కానీ.. అనేక మంది నిరుద్యోగుల ఆత్మ‌హ‌త్య‌ల త‌ర్వాత ఇప్పుడు ఎన్ని జాబులు ఇచ్చినా ఎందుకు దండ‌గ? అంటున్నారు. అయినా, 10 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులుంటే.. 80 వేల ఉద్యోగాలు ఏ మూల‌కు? ఎవ‌రి ముక్కుల‌కు? అని నిల‌దీస్తున్నాయి విప‌క్షాలు.