రోడ్డెక్కిన నిరుద్యోగులు.. చలో కలెక్టరేట్‌తో హైటెన్షన్.. జగనన్నకు మరో సెగ..
Published on: Thu Feb 10, 2022 11:07AM
మొన్నటి వరకూ ప్రభుత్వ ఉద్యోగులు జగన్ సర్కారును తూట్లు పొడిచారు. పీఆర్సీపై కదం తొక్కారు. ఛలో విజయవాడతో జగనన్నకు ముచ్చెమటలు పట్టించారు. సమ్మె సైరన్‌తో నిద్రలేకుండా చేశారు. చివరాఖరికి ఎలాగోలా.. పీఆర్సీకి మసిపూసి మారేడుకాయ చేసి.. మమ అనిపించారు. ఉపాధ్యాయులు, మిగతా ఉద్యోగుల మధ్య చీలికి తీసుకొచ్చి.. విభజించి పాలిస్తున్నారు. తాత్కాలికంగా పీఆర్సీ సెగపై నీళ్లు చల్లారు. అటు ఆ మంట అలా చల్లారిందో లేదో.. ఇటు నిరుద్యోగుల ఆగ్రహ జ్వాల ఎగిసిపడింది. జగనన్నకు మరో తలనొప్పి స్టార్ట్ అయింది. అంతా ఆయన చేసుకున్న పుణ్యమే!
ఏపీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటూ ఏపీ వ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళనలకు దిగారు. ‘చలో కలెక్టరేట్’ పేరుతో జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి ప్రయత్నించారు. టీఎన్‌ఎస్‌ఎఫ్, ఏఐఎస్‌ఎఫ్, యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ, చిత్తూరు, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, ఏలూరు, కాకినాడ, ఒంగోలు, కడపలో నిరసనలు చేపట్టారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పలు చోట్ల భారీ ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపట్టాలని.. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు.
ఆందోళనల్లో భాగంగా పలుచోట్ల నిరుద్యోగులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అనంతపురం, విజయనగరం జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి ఆందోళనకారులు ప్రయత్నించడం.. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కడపలో నిరుద్యోగులను అడ్డుకునేందుకు పోలీసులు ముళ్లకంచెలు అడ్డుగా వేశారు. ఆందోళనలకు దిగిన నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.


