ఉండవల్లికి జగన్ బంపరాఫర్.. వైసీపీలో చేరితే మంత్రి పదవి!!
Published on: Tue May 7, 2019 11:40AM

ఏపీలో తామే అధికారంలోకి వస్తామని వైసీపీ బలంగా నమ్ముతోంది. ఆ పార్టీ నేతలు, కార్యకర్తల కాన్ఫిడెన్స్ చూస్తుంటే.. సామాన్యులకు కూడా వైసీపీనే అధికారంలోకి వస్తుందనే అభిప్రాయం కలుగుతోంది. 'వైఎస్ జగన్ పేరుతో సీఎం నేమ్ ప్లేట్, జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడానికి ముహూర్తం' అంటూ ఇలా రకరకాలుగా వైసీపీ శ్రేణులు తమ అభిమానాన్ని, నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి. కొందరైతే జగన్ కేబినెట్ లో మంత్రులు వీళ్ళేనంటూ ఓ లిస్ట్ కూడా రెడీ చేశారు. అయితే ఇన్నిరోజులు ఆ లిస్ట్ లో వైసీపీ నేతల పేర్లే వినిపించాయి.. కానీ తాజాగా ఆ లిస్ట్ లో సీనియర్ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ పేరు కూడా వినిపిస్తోంది.
ఉండవల్లిని వైసీపీలోకి రావాలని జగన్ ఆహ్వానించారని, ఉండవల్లి త్వరలోనే వైసీపీ గూటికి చేరతారని.. ప్రస్తుతం ఏపీ రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఉండవల్లి రాజకీయాల్లో తలపండిన నేత. అన్ని విషయాలపై స్పష్టమైన అవగాహన ఉన్న నాయకుడు. అంతేకాకుండా జగన్ తండ్రి వైఎస్ కు ఎంతో ఆప్తుడు. ఎలాంటి విషయమైనా ముక్కు సూటిగా మొహమోటం లేకుండా చెప్పేస్తారు. ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడంలో దిట్ట.
రాష్ట్ర విభజన తరువాత నుంచి ఉండవల్లి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.ఆ మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. విభజన హామీలపై చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఉండవల్లి కూడా ఉన్నారు. అప్పట్లో ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేసిన ఆయన మళ్లీ సైలెంట్ అయిపోయారు. మళ్లీ ఈ మధ్య ఏపీలో జగన్ గెలుస్తారంటూ జోస్యం చెప్పారు. ఉండవల్లి ఓ వైపు ఏపీ రాజకీయాలపై విశ్లేషణలు చేస్తూనే.. మరోవైపు చంద్రబాబుపై గత కొంతకాలంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో తమ పార్టీలో ఉండవల్లి లాంటి సీనియర్ నేతలు ఉంటే పార్టీకి ఎంతో మేలు జరుగుతుందని జగన్ భావిస్తున్నారట. అందుకే తమ పార్టీ అధికారంలోకి వస్తే తన మంత్రివర్గంలో చేరాలని జగన్ ఉండవల్లిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. జగన్ ఆహ్వానానికి ఉండవల్లి కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఒకవేళ అధికారంలోకి రాకపోయినా.. ప్రతిపక్ష హోదాలో ఉన్నా కూడా చంద్రబాబును ధీటుగా ఎదుర్కోవాలంటే ఉండవల్లి లాంటి సీనియర్ నేతలు తమ పార్టీకి ఎంతో జగన్ అవసరమని భావిస్తున్నారట. అందుకే ఆయన ఉండవల్లిని పార్టీలో చేరమని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మరి ఉండవల్లి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


