పోలవరంపై ఎన్నో అనుమానాలు.. ఏది నిజం?
Published on: Tue May 7, 2019 4:39PM

పోలవరం నిర్మాణంపై తనకు అనుమానాలున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. తాజాగా ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. పోలవరంపై తన అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజల్ని తీసుకొచ్చి ప్రాజెక్టును చూపిస్తున్నారు కానీ.. తాను వస్తానంటే మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. పోలవరం విషయంలో నా అనుమానాలు నివృత్తి చేస్తే అక్కడే క్షమాపణ చెప్పి వస్తానని చాలెంజ్ చేశారు. 2018 లోనే పోలవరం పూర్తి చేసి నీటిని విడుదల చేస్తామన్నారని.. కానీ ఇప్పటికీ పూర్తవలేదని అసహనం వ్యక్తం చేశారు. మంత్రి దేవినేని ఉమా జూన్‌లో నీళ్లిస్తామని గతంలోనే ప్రకటించారని.. కానీ చంద్రబాబు మాత్రం వచ్చే ఏడాదికి నీళ్లు ఇస్తామని చెప్పారని.. ఏది నిజమని ప్రశ్నించారు. వచ్చే ఏడాది తర్వాత అయినా నీళ్లు ఎలా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం సహాయం లేదు.. ప్రాజెక్టును కట్టలేం అని చెప్పకుండా.. పూర్తి చేసేస్తున్నామంటూ చంద్రబాబు కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు సమీపాన మట్టి కుంగిపోతుంటే పట్టించుకోవడం లేదన్నారు. పోలవరం నిర్మాణ ప్రాంతంలో భూమి పగుళ్లు ఏర్పడుతున్నాయని.. ప్రమాదకర పరిస్థితిలో ప్రాజెక్టు నిర్మాణం అవుతోందని ఉండవల్లి ఆరోపించారు. భవిష్యత్తులో తేడా వచ్చి డ్యాం డ్యామేజ్ అయితే రాజమండ్రితో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తుడిచి పెట్టుకుపోతాయని ఉండవల్లి ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం దగ్గర జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పటికప్పుడు అధికారులు తనకు చెబుతున్నారని ఉండవల్లి తెలిపారు.


