జగన్ చంద్రబాబుని తట్టుకోలేడా? ఉండవల్లి లాజిక్ ఏంటి?

ఉండవల్లి అరూణ్ కుమార్… తెలుగు రాజకీయాల్లో అందరికీ తెలిసిన పేరు! అయితే, మాస్ పొలిటీషన్ గా కన్నా మేధావిగానే అరూణ్ కుమార్ ఫేమస్! ఆయన మాట్లాడితే అందరు రాజకీయ నేతల్లాగా తలా తోక లేని ఆరోపణలు చేయరు. తలకి, తోకకి ముడిపెట్టే లాజిక్ తో కొడుతుంటారు! అదే ఆయన మాటలకి వాల్యూ తీసుకొస్తుంటుంది. మీడియా చెవులు పెద్దవి చేసుకుని వినేలా చేస్తుంటుంది.

 

 

వైఎస్ హయాంలొ ఓ వెలుగు వెలిగిన ఉండవల్లి తరువాత క్రమంగా ప్రభ తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన ఏ పార్టీలోనూ లేరన్నట్టుగా వుంది పరిస్థితి. ఓ సారి పవన్ పక్కన కనిపిస్తారు. ఓ సారి చంద్రబాబును కలుసుకుంటారు. స్వయంగా కూడా నేను ఏ పార్టీకి మద్దతుగా లేనని చెబుతూనే అప్పుడప్పుడూ ఆసక్తికర కామెంట్లు చేస్తుంటారు. ఉండవల్లి తాజా మాటలు రాజకీయ వర్గాల్లో అలాగే ఇంట్రస్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి.

వైఎస్ కు ఎంతో ఆత్మీయుడైనప్పటికి ఉండవల్లి ఏనాడూ జగన్ కు దగ్గర కాలేదు.  ఎప్పుడూ వీరాభిమానం చాటలేదు. ఇక ఇప్పుడైతే పూర్తిగా జగన్ కు వ్యతిరేకంగా విశ్లేషణ చేస్తున్నారు. జగన్ కోసం జనం విపరీతంగా రోడ్ల మీదకు వస్తుండటం నిజమే అయినా అదంతా ఓ సినిమా హీరో కోసం రావటం లాంటిదేనని అన్నారు. ఎన్నికల సమయంలో వారంతా జగన్ కే ఓటు వేస్తారని గ్యారెంటీ లేదన్నారు. గత ఎన్నికల్లోనూ జగనే గెలుస్తాడని చాలా మంది భావించారని గుర్తు చేశారు. అయితే, చంద్రబాబు రాజకీయ వ్యూహాలు, ఎన్నికల ముందు ఆయన చేయగలిగే పోల్ మ్యానేజ్మెంట్ జగన్ తట్టుకోలేడని అన్నారు!

 

 

ఉండవల్లి వ్యాఖ్యలు చంద్రబాబుకు అనుకూలంగా, జగన్ కు వ్యతిరేకంగా వున్నాయి కాబట్టి ఆయన టీడీపీలో చేరతారని మనం ఇప్పుడే భావించలేం. ఎందుకంటే, ఉండవల్లి రాజకీయ ఉద్దేశ్యాలు ఏవీ లేకుండా కూడా విశ్లేషణలు చేస్తుంటారు. ఆయన రాష్ట్ర విభజన విషయంలో కూడా మిగతా ఆంధ్రా నాయకులందరి కంటే భిన్నంగా స్పందిస్తూ వచ్చారు. అలాగే, ఇప్పుడు చంద్రబాబు, జగన్ ల సత్తాని ఆయన నిష్పక్షపాతంగానే అంచనా వేశారని మనం భావించవచ్చు. చంద్రబాబు అనుభవం, జనం నాడిని పట్టగలిగే చాకచక్యం ఎన్నికల చాణక్యం … ఇవన్నీ అందరికీ తెలిసినవే. మరో వైపు జగన్ పార్లమెంట్లో, అసెంబ్లీలో తన ఎంపీల్ని, ఎమ్మెల్యేల్ని ఉపసంహరించుకుని చేస్తున్న రాజకీయం, సుదీర్ఘ పాదయాత్ర, పవన్ పై వ్యక్తిగత విమర్శలు… ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూనే వున్నాం. కాబట్టి ఏ మాత్రం తేడా వచ్చినా చంద్రబాబు అయిదేళ్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఛేదించుకుని మళ్లీ అధికారంలోకి రావటం ఆశ్చర్యకరమేం కాదు. కానీ, జగన్ తనకున్న అనుభవ లేమీ, దూకుడు స్వభావంతో ఏపీ నెక్ట్స్ సీఎం అవుతారా? డౌటేనంటున్నారు ఉండవల్లి!

ఉండవల్లి వ్యాఖ్యలు నిజమవుతాయా లేదా? జగన్ నవ్యాంధ్రా రెండో సీఎం అవుతారా? లేక చంద్రబాబే నవ్యాంధ్రకి రెండోసారి సీఎం అవుతారా? వేచి చూడాలి! ప్రస్తుతానికైతే సస్పెన్సే!