ఆ ఇద్దరితో ఫుట్‌బాల్!?.. జగనన్నా మజాకా!!
Published on: Sat Feb 19, 2022 1:27PM
జగన్ రెడ్డి సర్కార్ ఇటీవలే చేసిన రెండు కీలక బదిల్లీల్లో అనూహ్యమైన మలుపులు చోటుచేసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డీజీపీ గౌతమ్ సవాంగ్ ను అకస్మాత్తుగా ఆ పదవి నుంచి తప్పించి, జీఏడీకి రిపోర్టు చేయాలని సర్కార్ ఆదేశించింది. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ ను కూడా ఏపీ సర్కార్ ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజా పరిణామంగా గౌతమ్ సవాంగ్ ను ఏపీపీఎస్‌సీ చైర్మన్ గా నియమించింది. అయితే.. రాజ్యాంగ పదవి అయిన ఏపీపీఎస్సీ చైర్మన్ గా సవాంగ్ బాధ్యతలు చేపట్టాలంటే తన ఐపీఎస్ హోదాను వదులుకోవాల్సి ఉంటుంది. సవాంగ్ రిటైర్ మెంట్ కు మరికొన్ని సంవత్సరాలే ఉండడంతో ఆయన తన ఐపీఎస్ హోదాను వదులుకునేందుకు సిద్ధంగా లేరనే వార్తలు వినిపించాయి. దీంతో గౌతమ్ సవాంగ్ ఫైల్ ను‘డీమ్డ్ టు బి రిటైర్డ్’ క్లాజుతో గవర్నర్ ఆమోదానికి సర్కార్ పంపించింది. అంటే ఏపీపీఎస్సీ పోస్టులో చేరిన మరుక్షణం నుంచీ సవాంగ్ ఐపీఎస్ హోదా రద్దయిపోతుందన్నమాట.
ఇక మరో బ్యూరోక్రాట్ ప్రవీణ్ ప్రకాశ్ మాత్రం తాను ఢిల్లీకి వెళ్లబోనని, సీఎం పేషీలోనే ఉంటానంటూ మొండికేసినట్లు వినికిడి. కోరుకున్నది ఒకటైతే జరిగింది మరొకటని ప్రవీణ్ ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లేదంటే మరో ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఏపీలోనూ, అక్కడ ఢిల్లీలో కూడా ఒకేసారి రెండు బాధ్యతలు నిర్వర్తిస్తానంటూ ప్రవీణ్ ప్రకాశ్ ప్రపోజల్ పెట్టారట. కానీ అందుకు జగన్ రెడ్డి సర్కార్ కేసుల నెపం చెప్పి ససేమిరా అందట. దీంతో చేసేదేమీ లేక ప్రవీణ్ ప్రకాశ్ ఉసూరుమంటూ శుక్రవారం రాత్రికి ఢిల్లీ వెళ్లారట.
గౌతం సవాంగ్ ఏపీ డీజీపీ అయినప్పటి నుంచీ జగన్ కు, ఆయన ప్రభుత్వానికి, వైసీపీ నేతలకు అనుకూలంగా అనేక విషయాల్లో తోడ్పాటు అందించారు. ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడంలో, వారిని అరెస్టులు చేయించడంలో, జైళ్లలో పెట్టించడంలో గౌతమ్ సవాంగ్ సర్కార్ అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు టీడీపీ నేతలు నిరంతరం దుమ్మెత్తి పోస్తూనే ఉండేవారు. అలాంటి నమ్మిన ఆఫీసర్ గౌతమ్ సవాంగ్ ను జగన్ సర్కార్ అత్యంత అవమానకరమైన రీతిలో బదిలీ చేయడంపై పలు వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అలా వస్తున్న విమర్శల దాడి నుంచి తప్పించుకునేందుకే అన్నట్లు.. సవాంగ్ ఇమేజిని పెంచుతున్నట్లు వైసీపీ సర్కార్ ఇప్పుడాయనకు ఏపీపీఎస్సీ సారథిగా నియమించిందని అంటున్నారు. నిజానికి సవాంగ్ ఇమేజిని జగన్ రెడ్డి సర్కార్ పెంచేదే అయితే.. అర్ధంతరంగా బదిలీ చేసి జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించడమేంటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. సవాంగ్ బదిలీ వ్యవహారం ముమ్మాటికి ఆయనను అవమానించడమే అంటున్నారు. గౌతమ్ సవాంగ్ విషయంలో జగన్ రెడ్డి సహజసిద్ధ వైఖరి వాడుకుని వదిలించుకునే తీరునే బయటపెట్టారనే విమర్శలు వచ్చాయి. అయితే.. సవాంగ్ అసలే పోలీసాఫీసర్.. గత అనుభవాల దృష్ట్యా ఏపీపీఎస్సీ పోస్టుకు వెళ్లేందుకు ముందు నిరాకరించారనే సమాచారం వచ్చింది. దాంతో తన సన్నిహితుల ద్వారా రోజంతా రాయబారాలు పంపి ఎంతో కష్టపడి సవాంగ్ ను జగన్ రెడ్డి ఒప్పించారంటారు.
సీఎం పేషీలో ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రవీణ్ ప్రకాశ్ బదిలీ విషయంలో జగన్ రెడ్డి సర్కార్ కు బాగా తలబొప్పి కట్టిందనే వార్తలు వచ్చాయి. ప్రవీణ్ ప్రకాశ్ సతీమణి భావనా సక్సేనా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిపోయారు. ఆమె పనిచేస్తున్న పోస్టులోకే ప్రవీణ్ ప్రకాశ్ ను బదిలీ చేస్తూ ఏపీ సీఎస్ సమీర్ శర్మ స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ప్రవీణ్ ప్రకాశ్ ఏపీ సీఎం పేషీలో ఉంటూనే.. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషన్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించలని కోరుకున్నారట. కానీ ఏదో సమాచార లోపం తలెత్తి ఆయనను ఎకాఎకిన ఢిల్లీకి బదిలీ చేసేశారు. దాంతో సీఎం పేషీని తాను వదిలేది లేదని మొండికేశారట. బదిలీ అయినా ఆయన మూడు రోజుల పాటు పేషీలోనే ఉండడం విశేషం. పేషీలోనే కొనసాగించాలంటూ సీఎం జగన్ పై ఎంతగా వత్తిడి తెచ్చినా స్పందన లేకపోవడంతో ఇక చేసేదేమీ లేక ప్రవీణ్ ప్రకాశ్ ఢిల్లీకి పయనమయ్యారని అంటున్నారు.


