TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నోబాల్ ఇచ్చాడని..అంపైర్‌ చెల్లిని చంపిన క్రికెటర్

Published on: Tue May 31, 2016 6:11PM

ఏ ఆట ఆడేవారికైనా క్రీడాస్పూర్తి లేకుంటే జరిగే దారుణాలు ఊహకు కూడా అందవు. ఈ నేపథ్యంలో "నోబాల్" ఇచ్చాడన్న కోపంతో ఓ క్రికెటర్‌ అంపైర్‌ చెల్లెలిని కడతేర్చాడు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు సమీపంలోని "జరారా" అనే చిన్నపట్టణం ఉంది. ఐపీఎల్ పోటీలను స్పూర్తిగా తీసుకున్న ఇక్కడి క్రీడాభిమానులు "జేపీఎల్" నిర్వహించుకుంటారు. ఈ నెల 14న మొదలైన జేపీఎల్‌లో గెలిచిన జట్టుకు రూ.5,100 నగదు బహుమతి ఇస్తామని కూడా నిర్వహకులు ప్రకటించారు. ఈ నెల 28న జరారా, బరికి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ మధ్య సాగుతుండగా.."అంపైర్ రాజ్‌కుమార్" నో బాల్ అంటూ ప్రకటించడంతో క్రికెటర్ "సందీప్ పాల్" కోపంతో రగిలిపోయాడు. వెంటనే అంపైర్ రాజ్‌కుమార్ వద్దకు వెళ్లి, గొడవపడ్డాడు. నోబాల్ కాదని చెప్పమన్నాడు. కానీ అంపైర్ వినలేదు. దీంతో సందీప్ హెచ్చరిస్తూ నువ్వు తప్పు చేస్తున్నావని, దీనికి శిక్షగా నీ ఇంట్లో ఒకరిని కోల్పోవలసి వస్తుందని హెచ్చరించాడు. ఆటలో ఇవన్నీ మామూలేనని రాజ్‌కుమార్ తేలిగ్గా తీసుకున్నాడు.

 

ఈ నేపథ్యంలో ఈ నెల 29న రాజ్‌కుమార్ చెల్లి పూజ తన స్నేహితురాళ్లతో పొలానికి వెళుతండగా సందీప్ కూల్‌డ్రింక్ ఇచ్చాడు. వారికి సందీప్ తెలియడంతో ఎలాంటి అనుమానం లేకుండా తాగేశారు. అయితే వాటిలో విషం కలిపి ఇవ్వడంతో వారు అస్వస్థతకు గురయ్యారు. విషం మోతాదు ఎక్కువగా ఉండటంతో రాజ్‌కుమార్ చెల్లెలు పూజ మరణించగా మిగిలిన ముగ్గురు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుకుంటున్నారు. జరిగిన ఘోరంపై గ్రామపెద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఈ పోటీలు వద్దని నేను ముందునుంచే చెబుతున్నాను. నా భయం నిజమైంది. ఇక్కడి వారెవరికీ క్రీడాస్పూర్తి ఉండదు. పగలు, కొట్టుకోవడాలు తప్ప" అని ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ పడటం మంచిదే కానీ కక్షలు పెంచుకుని ప్రతీకారాలు తీర్చుకోవడం మాత్రం దారుణం. అందుకే ఆటగాళ్లకు క్రీడాస్పూర్తిని నూరిపోయాల్సిన అవసరం ఎంతో ఉందని మరోసారి రుజువైంది.