కాంగ్రెస్ పార్టీ వల్లే నా కూతురు పరీక్షల్లో ఫెయిలైంది
Published on: Wed May 8, 2019 4:50PM

ఎన్నికల వేళ రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం సహజం. అయితే.. కర్ణాటకలో ఓ నేత మాత్రం తన కుమార్తె పరీక్షల్లో ఫెయిల్ కావడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని విచిత్ర ఆరోపణలు చేశారు. బీజేపీ నేత ఉమేశ్ జాదవ్ చిన్న కుమార్తె ఇటీవల పీయూసీ పరీక్షలు రాసింది. అయితే ఆ పరీక్షల్లో ఆమె ఫెయిలైంది. అయితే తన కుమార్తె పరీక్షల్లో ఫెయిల్ కావడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలే కారణమని ఉమేష్ జాదవ్ ఆరోపించారు.
కర్ణాటకలోని చించోలీలో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రతీ పరీక్షలోనూ నా కూతురు బాగా చదివి మంచి మార్కులతో పాస్ అయింది. అయితే, కాంగ్రెస్ నేతలు నా మీద, నా కుటుంబం మీద పదే పదే ఆరోపణలు చేయడంతో కుటుంబం మొత్తం మానసికంగా కుంగిపోయింది. అందువల్ల తాను పరీక్ష సరిగా రాయలేకపోయానని నా కూతురు చెప్పింది. పరీక్ష కూడా ఫెయిల్ అయింది.’ అని ఉమేష్ జాదవ్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తరపున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉమేష్ జాదవ్.. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో కలబుర్గి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే మీద ఆయన పోటీ చేశారు. ఈ క్రమంలో ఉమేష్ జాదవ్ రూ.50 కోట్లు తీసుకుని బీజేపీలో చేరారంటూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఈ ప్రచారం వల్ల తన కుటుంబం మొత్తం మానసిక వేదనకు గురైందని, తన కుమార్తె పరీక్ష కూడా ఫెయిల్ అయిందని ఉమేష్ జాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.


