TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జోక‌ర్ నుంచి లీడ‌ర్ వ‌ర‌కు.. ఉక్రెయిన్ అధ్య‌క్షుడి లైఫ్ స్టోరీ..

Published on: Mon Feb 28, 2022 2:01PM

ఉక్రెయిన్‌పై ర‌ష్యా విరుచుకుప‌డుతోంది. అంత‌పెద్ద దేశం ఉప్పెన‌లా మీద‌ప‌డుతున్నా.. ఉక్రెయిన్ ఏమాత్రం అద‌డ‌రం లేదు.. బెద‌ర‌డం లేదు. దూసుకొస్తున్న ర‌ష్య‌న్ ఆర్మీతో హోరాహోరీ త‌ల‌ప‌డుతోంది. అందుకు కార‌ణం.. ఆ దేశ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ నాయ‌క‌త్వ ప‌టిమే. అవును, జెలెన్‌స్కీ ఉక్రెయిన్ ప్ర‌జ‌ల్లో స్పూర్తి ర‌గిలిస్తున్నారు. తాను స్వ‌యంగా ఆయుధం చేత‌ప‌ట్టి.. క‌ద‌న‌రంగంలో దూకి.. ప్ర‌జ‌ల‌ను ఉద్రేక ప‌రుస్తున్నారు. పోరాడితే పోయేదేమీ లేదంటూ.. నాకు ర‌క్తం ఇవ్వండి మీకు ర‌ష్యా నుంచి స్వేచ్ఛ ఇస్తానంటూ.. చైత‌న్య ప‌రుస్తున్నారు. అందుకే, ఇప్పుడు ప్ర‌పంచ దేశాలు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీని ప్ర‌శంసిస్తున్నారు. 

ఈజీగా గెలిచేయొచ్చ‌ని భావించిన ర‌ష్యాకు చుక్క‌లు చూపిస్తున్నారు జెలెన్‌స్కీ. భయపడి.. డ‌బ్బు మూట‌ల‌తో.. దేశాన్ని వదిలి పారిపోలేదు. అలాగ‌ని, అధ్యక్ష భవనంలో దాక్కొని భ‌యం భ‌యంగా బ‌త‌క‌లేదు. బాంబుల మోతలతో దద్దరిల్లుతున్న కీవ్‌ వీధుల్లో.. సైనిక దుస్తుల్లో కలియతిరుగుతూ.. ప్ర‌జ‌ల‌ను యుద్ధానికి స‌మాయ‌త్తం చేస్తున్నారు. అధ్య‌క్షుడు జెలెన్‌స్కీని చూసి.. ఉక్రెయిన్ ప్ర‌జ‌లే ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈయ‌న ఆయ‌నేనా..! అని అవాక్క‌వుతున్నారు. ఎందుకంటే.. గ‌తంలో టీవీలో కామెడీ సీరియ‌ల్స్‌తో క‌డుపుబ్బా న‌వ్వించిన జెలెన్‌స్కీ.. ఇప్పుడిలా తుపాకీ ప‌ట్టి.. క‌ద‌న‌రంగంలోకి దూక‌డం చూసి గ‌తాన్ని ఓ సారి గుర్తు చేసుకుంటున్నారు. 

అధ్యక్షుడు కాకముందు జెలెన్‌స్కీ ప్ర‌ముఖ హాస్యనటుడు. టీవీ షోల్లో కామెడీ పాత్రలతో ప్రజలను బాగా నవ్వించేవారు. కీవ్‌ నేషనల్‌ ఎకనమిక్‌ యూనివర్సిటీలో న్యాయవాద విద్య పూర్తి చేసిన ఆయ‌న‌.. ఆ తర్వాత నటుడిగా మారారు. ‘క్వార్టల్‌ 95’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను మొదలెట్టి.. సినిమాలు, టీవీ షోలు నిర్మించేవారు. నటించేవారు. ‘సర్వెంట్‌ ఆఫ్‌ ది పీపుల్‌’ పేరుతో జెలెన్‌స్కీ నిర్మించి, న‌టించిన‌ ఓ టీవీ షో.. 2015-18 మధ్య కాలంలో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. ఆ టీవీ  కామెడీ షోలో ఆయన, ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా న‌టించ‌డం ఆస‌క్తిక‌రం. కామెడీ రోలే అయినా.. అవినీతిని అంతం చేసే ప్రెసిడెంట్‌గా జెలెన్‌స్కీ పాత్ర ప్రజల‌ను విపరీతంగా ఆక‌ట్టుకుంది. 

ఆ టీవీ షో హిట్‌తో.. ఆయ‌న నేరుగా రాజకీయాల్లోకి వచ్చారు. 2019 అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో అదృష్టం ప‌రీక్షించుకున్నారు. తన టీవీ షో ‘సర్వెంట్‌ ఆఫ్‌ ది పీపుల్‌’ పేరుతోనే.. తన టీవీ బృందంతో కలిసి పార్టీని స్థాపించారు. దేశాధ్యక్ష పదవికి స్వతంత్ర అభ్యర్థిగా బ‌రిలో దిగారు. జెలెన్‌స్కీ అధ్యక్షుడైతే  టీవీ షోలోని పాత్ర తరహాలోనే.. అవినీతిని అంతం చేస్తారని ప్రజలు భావించారు. 73.2 శాతం ఓట్లతో జెలెన్‌స్కీని గెలిపించారు. అలా ఉక్రెయిన్‌కు అధ్యక్షుడయ్యారు జెలెన్‌స్కీ. 

దేశాన్ని నడపడం అంటే ‘కామెడీ షో’ కాదని విమ‌ర్శించాయి ప్ర‌తిప‌క్షాలు. ఆయనలో పరిపక్వత లేదని, దేశ‌ నాయకత్వానికి సరితూగే వ్యక్తి కాదని త‌క్కువ చేసి మాట్లాడాయి. అయితే, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ యుద్ధంలో.. ర‌ష్యా దాడిని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటూ.. ప్ర‌జ‌ల‌ను యుద్ధానికి సిద్ధం చేస్తూ.. త‌న నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను బ‌లంగా చాటుకుంటున్నారు జెలెన్‌స్కీ. తాను క‌మెడియ‌న్‌ను మాత్ర‌మే కాదని.. కింగ్‌లాంటి వాడిన‌ని నిరూపించుకుంటున్నారు.