మోదీ చెబితే పుతిన్ వింటారు.. భారత్ సాయం కోరిన ఉక్రెయిన్..
Published on: Thu Feb 24, 2022 3:01PM
ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగింది. ఇరుపక్షాల మధ్య యుద్ధం జరుగుతోంది. రష్యా బలమైన దేశం. ఎంతగా పోరాడినా ఉక్రెయిన్‌కు ఓటమి తప్పకపోవచ్చు. ఆ మేరకు కోలుకోలేని నష్టం తప్పదు. ప్రపంచ దేశాలన్నీ యుద్ధం వద్దని చెబుతున్నా.. ఆంక్షలతో బెదిరించినా.. రష్యా వెనక్కి తగ్గట్లేదు. ఇక, చివరి ప్రయత్నంగా భారత్ సాయం కోరింది ఉక్రెయిన్. ఇండియా-రష్యాల మధ్య మంచి సంబంధాలు ఉండటం.. మోదీ-పుతిన్‌ల స్నేహబంధం దరిమిలా.. భారత్ చెబితే రష్యా వింటుందేమోననే చిన్న ఆశ.
రష్యా దాడులతో.. తాజాగా ఉక్రెయిన్.. భారత్ సాయాన్ని కోరింది. ఉద్రిక్తతలను తగ్గించడంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని, ఈ విపత్కర పరిస్థితుల్లో ఢిల్లీ తమకు అండగా ఉండాలని భారత్‌లోని ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా కోరారు. రష్యా-ఉక్రెయిన్ విషయంలో భారత ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు.
"సైనిక చర్యే అని ప్రకటిస్తోన్న రష్యా.. ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుద్ధానికి దిగింది. రష్యా బలగాలు సరిహద్దులను దాటి మా భూభాగంలోకి వచ్చేశాయి. కొన్ని చోట్ల దాడులు జరగ్గా.. సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా మృతిచెందినట్లు ప్రాథమిక సమాచారం వచ్చింది. పరిస్థితులు క్షీణిస్తున్నాయి. ఈ సంక్షోభ సమయంలో భారత్ జోక్యం చేసుకుని మాకు అండగా ఉండాలని కోరుతున్నాం."
"భారత్ ప్రభావవంతమైన దేశం. దౌత్యపరంగా మీ చరిత్ర గురించి మాకు తెలుసు. గతంలో చాలా సార్లు భారత్ శాంతిస్థాపనలో కీలక పాత్ర పోషించింది. రష్యాతో భారత్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. అందువల్ల ఉద్రిక్తతలను తగ్గించడంలో దిల్లీ కీలక పాత్ర పోషించగలదని భావిస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తక్షణమే రష్యా అధ్యక్షుడు పుతిన్, మా అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ఫోన్ చేసి మాట్లాడాలని కోరతున్నా. మోదీజీ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన, గౌరవప్రదమైన నేత. ఎవరు చెబితే పుతిన్ వింటారో లేదో తెలియదు గానీ.. మోదీ చెబితే పుతిన్ వింటారని విశ్వసిస్తున్నాం. ఈ యుద్ధాన్ని ఆపేలా మీ బలమైన గళాన్ని కోరుతున్నాం" అని ఇగోర్ పొలిఖా భారత్‌ను కోరారు.
అయితే, ఉక్రెయిన్-రష్యా వివాదంలో భారత్ తటష్ట వైఖరి అవలంభిస్తుందని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయినా, ఉక్రెయిన్ రాయబారి.. మోదీ చెబితే పుతిన్ వింటారంటూ.. భారత జోక్యాన్ని కోరడం ఆసక్తికరం.


