బ్రిటన్‌లో మరో కొత్త స్ట్రెయిన్ కరోనా.. ఇది మరింత ప్రమాదకరం..
Published on: Thu Dec 24, 2020 10:11AM
కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ తో ఇప్పటికే సతమతమవుతున్న బ్రిటన్ లో తాజాగా అంతకంటే ప్రమాదకరమైన మరో కొత్త రకం కరోనా వైరస్ బయటపడింది. కొన్ని వారాల క్రితం దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన పలువురు పర్యాటకులకు కరోనా టెస్టులు చేయగా, వారిలో ఇద్దరికి ఈ ప్రమాదకర కొత్త కొవిడ్ వైరస్ సోకినట్లు బ్రిటన్ ఆరోగ్య మంత్రి మట్ హన్‌కాక్ తెలిపారు. దీంతో గత రెండువారాల వ్యవధిలో దక్షిణాఫ్రికా నుంచి యూకేకు వచ్చిన వారందరినీ వెంటనే ఐసొలేట్ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కొత్త రకం కొవిడ్ వైరస్ మరిన్ని జన్యుమార్పులకు గురైందని, దీని వ్యాప్తిరేటు చాలా ఎక్కువని పేర్కొన్నారు.
తాము తాజాగా గుర్తించిన కొత్త రకం కొవిడ్ వైరస్.. దక్షిణాఫ్రికాలో వ్యాపిస్తున్న వైరస్ వేరియంట్ కంటే భిన్నంగా ఉందని హన్‌కాక్ అన్నారు. కొత్త రకం వైరస్ వెలుగు చూసిన నేపథ్యంలో అప్రమత్తమైన బ్రిటన్ ప్రభుత్వం దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికుల రాకపోకలపై నిషేధం విధించింది. తాజా పరిణామాల నేపథ్యంలో.. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన లాక్‌డౌన్‌ను మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయం తీసుకుంది.
ఇది ఇలా ఉండగా కరోనా కొత్త స్ట్రెయిన్ వైరస్ ఇప్పటికే చాలా దేశాలకు పాకి ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ కొత్త స్ట్రెయిన్‌లోని స్పైక్ ప్రొటీన్‌లో కొన్ని జన్యుమార్పులు జరిగినా, కరోనా వ్యాక్సిన్లతో వచ్చే రోగ నిరోధక శక్తిని ఎదురించి అవి నిలువలేవని ఆమె అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ జన్యుక్రమాలపై లోతైన అధ్యయనంతో శక్తివంతమైన వ్యా క్సిన్‌ను అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు. ఒక్క భారతదేశమే ఇప్పటివరకు 3 లక్షల జన్యుక్రమాల సమాచారాన్ని అంతర్జాతీయ పరిశోధనల డాటాబే్‌సకు అందించిందని ఆమె చెప్పారు.


