ఐటీ గ్రిడ్స్ కేసు.. డేటా చోరీ కాలేదు

 

ఎన్నికలకు ముందు తెలుగురాష్ట్రాల్లో ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ వివాదం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఐటీ గ్రిడ్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లోని 7.82కోట్ల మంది ఆధార్ కార్డుల వివరాలను సేకరించిందంటూ ఆరోపణలు వెల్లువెత్తడంతో దానిపై కేసు నమోదైంది. కాగా తాజాగా ఈ అంశంపై భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక ప్రకటన చేసింది. ఈ కేసుకు సంబంధించి తమ సర్వర్లలోకి అక్రమంగా చొరబడినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. తమ ‘సెంట్రల్‌ ఐడెంటిటీస్‌ డేటా రిపాజిటరీ’ (సీఐడీఆర్‌), సర్వర్లు పూర్తి సురక్షితంగా ఉన్నాయని పేర్కొంది. సీఐడీఆర్‌లోకి అక్రమంగా ఎవరూ అనుసంధానం కాలేదని, సర్వర్ల నుంచి ఎలాంటి డేటా అపహరణకు గురికాలేదని తెలిపింది. ప్రజల ఆధార్‌ నెంబర్లు, పేర్లు, చిరునామా తదితరాలను యూఐడీఏఐ సర్వర్ల నుంచి చోరీ చేశారనడానికి.. ఐటీ గ్రిడ్స్ కేసు విచారణ జరుపుతున్న సిట్‌ ఎలాంటి ఆధారాలను గుర్తించలేదని పేర్కొంది.

అయితే, వివిధ సేవలు అందించే సర్వీసు ప్రొవైడర్లే వినియోగదారుల నుంచి నేరుగా ఆధార్‌ సంఖ్య, ఇతర వివరాలను సేకరిస్తాయి. ఆధార్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టాల ప్రకారం ఈ సమాచారాన్ని నిర్దేశిత అవసరం కోసమే సర్వీసు ప్రొవైడర్లు ఉపయోగించాలి. కానీ, వినియోగదారుల అనుమతి లేకుండా ఇతరులతో ఈ వివరాలను పంచుకోకూడదని యూఐడీఏఐ వివరించింది. ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘించి ఆధార్‌ సంఖ్యలను సేకరించడం, వాటిని నిల్వచేయడం, వినియోగించడం, ఇతరులతో పంచుకోవడం చేస్తే ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

మరోవైపు ఐటీ గ్రిడ్స్‌ సంస్థ ఆధార్‌ చట్టంలోని ఏవైనా నిబంధనలను ఉల్లంఘించారా? అనేది పరిశీలించాలని పోలీసులు తమను కోరినట్లు తెలిపింది. అయితే, ఈ ఘటనతో యూఐడీఏఐ డేటా, సర్వర్లకు ఎలాంటి సంబంధంలేదు. పైగా ఒక వ్యక్తి ఆధార్‌ సంఖ్య బయటకు తెలియడం వల్ల అతడికి ఎలాంటి ముప్పు ఉండదు. బయోమెట్రిక్‌ లేదా వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ వంటి రెండో అంచె భద్రత ఉంటుందని తెలిపింది. ఐటీ గ్రిడ్స్‌ కేసుకు సంబంధించి తమ సర్వర్లతో, సమాచారంతో ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. అయితే.. ఐటీ గ్రిడ్స్‌ సంస్థ ఆధార్‌ సమాచారాన్ని ఏ అవసరం కోసం సేకరించింది, చట్ట ఉల్లంఘన జరిగిందా అనే విషయాలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని యూఐడీఏఐ వివరించింది.