ఉత్సాహం నింపే ఉగాది

Publish Date:Mar 20, 2015ముందుగా అందరికీ శ్రీ మన్మథ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ మన్మథ నామ సంవత్సరానికి సంవత్సరానికి స్వాగతం పలికే ఈ రోజున అందరి జీవితాలలో సుఖ సంతోషాలు నిండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.

‘కొత్త’ ఎప్పుడూ ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అందుకే అనంతమైన కాలానికి అక్కడక్కడ ఇలా కొత్తదనాన్ని ఆపాదిస్తూ మనల్ని మనం ఉత్సాహపరచుకుంటూ వుంటాం. నిన్నటిదాకా లేనిదేదో ఈరోజు సరికొత్తగా రూపుదిద్దుకుంటోందని భావిస్తాం. ఈ ఉత్సాహం, ఈ ఆశే ఈరోజంతా పండుగ వాతావరణం నెలకొనటానికి కారణం. ఈ చిన్న విషయాన్ని గ్రహించగలిగితే ప్రతిరోజునూ పండుగలా వేడుకగా మార్చుకోగలం. ఉగాది పండుగను మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా అనేక ప్రాంతాల్లో చేసుకుంటారు. ఆ వివరాలు...

ఉగాదిని మహారాష్ట్రలో గుడిపడ్వాగా, సింధీలు చేతిచంద్‌గా, పంజాబీలు బైశాఖీగా, తమిళనాడులో పుతండుగా, మణిపురిలో సాజి బుచె రోబా (saji bchei rao ba)గా, కర్ణాటకలో యుగాదిగా పిలిచే ఈ రోజు మనందరితోపాటు వీరందరికీ కొత్త సంవత్సర ఆరంభమే. వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలువబడుతూ, వివిధ ఆచారాలు పాటించినా అందరూ కోరుకునేది ఒక్కటే... ‘కాలం’ కరుణ చూపించాలని. జీవితాలలో ఆనందాన్ని నింపాలని.

ఉగాది ఓ కొత్త ఆశకి చిగురు తొడిగే రోజని మనమందరం భావిస్తాం. అయితే ఇక్కడే ఓ చిన్న విషయాన్ని గ్రహించాలంటారు మన పెద్దలు. మనం నాటే ఓ విత్తనం మొలకెత్తి, చిగురించి మొక్కగా మారడానికి కొంత సమయం పడుతుందని మనందరికీ తెలిసిందే. అలాగే మన ఆశల విత్తనాలు చిగురించి ఓ వృక్షంగా మారి మధుర ఫలాల్ని అందించడానికి కూడా కొంచెం సమయం పడుతుంది. మన ఆశల విత్తు మొలకెత్తేందుకు దృఢ సంకల్పమనే నీరు చాలు. అది వటవృక్షమై మన లక్ష్యాల ఫలాలని మనకందించడానికి. అందుకే ఈ ఉగాది రోజున మన మనసులలో ఓ చిన్న విత్తుని నాటుదాం. దాని ఫలాల కోసం వచ్చే ఉగాది వరకూ ఎదురుచూద్దాం.

నాకు బాగా గుర్తు... మా తాతగారు ఉగాది రోజున ఉగాది పచ్చడి పెట్టి, అక్షింతలు వేసి ఆశీర్వదించాక ఇంట్లో అందర్నీ ఒకచోట కూర్చోబెట్టి ఒక్కొక్కరిని ఇలా అడిగేవారు. ‘‘ఈ సంవత్సరమంతా ఎలా గడవాలని కోరుకుంటున్నావ్?’’ అని. ఎవరికి వాళ్ళం మా మా ఆశలు, కలల గురించి చెప్పేవాళ్ళం. అంతా విన్నాక ఒక్కసారి కళ్ళు మూసుకుని మీరు కోరుకున్నవన్నీ జరుగుతున్నట్టు ఊహించుకోండి. ఆ సమయంలో మీ మనసులో నిండే ఆనందాన్ని ఇప్పుడే పొందండి అనేవారు. మేం అలాగే చేసేవాళ్ళం. ఆశ్చర్యంగా మా ఆశలు, కోరికలు తీరతాయనే గట్టి నమ్మకం ఏర్పడేది. దీన్నే క్రియేటివ్ విజువలైజేషన్ అంటారని ఆ తర్వాత తెలిసింది నాకు. ఇప్పటికీ మేం అందరం ఈ సంవత్సరం మా జీవితాలలో ఏయే మార్పులు తెస్తోంది అన్నది కళ్ళముందు నింపుకుంటాం. ఆ ఉత్సాహాన్ని గుండెల్లో నింపుకుని రేపటి కోసం ఎదురుచూస్తాం.

ఈ శ్రీ మన్మథ నామ సంవత్సరాది రోజున మనందరం ఈ సంవత్సరమంతా మనం కోరుకునేవన్నీ మనకి దక్కాలని ఆశపడతాం. అయితే అవన్నీ మనకి దక్కుతాయో లేదోనని ఓ చిన్న భయం కూడా మనల్ని వెంటాడుతుంది. ఆ భయాన్ని వదిలేసి మనం కోరుకున్నది మనకి దక్కినట్టు అప్పటి ఆ ఆనందం రుచిని ఇప్పుడే పొందగలిగితే అది మనలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ ఉగాదికి మనకి మనం ఇచ్చుకోవలసిన కానుక అదే.

సరే మరి.. ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, కొత్త బట్టలు, కొత్త ఆశలు, మావి చిగురులు... ఇవన్నీ మనలో నింపే ఉత్సాహం ఈ సంవత్సమంతా మన వెన్నంటి వుండాలని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి శ్రీ మన్మథ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

-రమ ఇరగవరపు

 

By
en-us Political News