TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉగాది ఉత్కంఠ‌!.. రాజ్‌భ‌వ‌న్‌కు కేసీఆర్ వెళ్తారా? వెళ్ల‌రా?

Published on: Fri Apr 1, 2022 2:49PM

రాజ్‌భ‌వ‌న్ వ‌ర్సెస్ ప్ర‌గ‌తి భ‌వ‌న్. గ‌వ‌ర్న‌ర్ వ‌ర్సెస్ సీఎం. ప‌చ్చ‌గ‌డ్డి వేయ‌కుండానే భ‌గ్గు మంటోంది. కేసీఆర్ దూకుడు త‌గ్గేదేలే. త‌మిళిసై సైతం ఎక్కడా త‌గ్గ‌ట్లే. రెండు రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య ప్ర‌చ్చ‌న్న‌యుద్ధం. ఇగో ప్రాబ్ల‌మ్‌. ఆ చేదు ప‌రిస్థితుల‌న్నిటినీ మ‌ర్చిపోతూ.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు తీపి క‌బురు పంపింది రాజ్‌భ‌వ‌న్‌. ఏప్రిల్ 1 సాయంత్రం గ‌వ‌ర్న‌ర్ బంగ్లాలో జ‌రిగే ఉగాది వేడుక‌ల‌కు హాజ‌రు కావాలంటూ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం వ‌చ్చింది. మ‌రి, త‌మిళిసై ఇన్విటేష‌న్‌కు.. కేసీఆర్ ఎలా స్పందిస్తారు? రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్తారా?  విభేదాలు ప‌క్క‌న‌పెడ‌తారా? గ్యాప్‌ను పూడుస్తారా? మ‌ళ్లీ మంచి వాతావ‌ర‌ణం తీసుకొస్తారా? అనేది ఆస‌క్తిక‌రం. 

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఏప్రిల్ 2న ఉగాది ఉత్సావాలు జ‌రగ‌నున్నాయి. అదే రోజు వేడుక‌లు నిర్వ‌హిస్తే కేసీఆర్ ఎలాగూ రానంటారు కాబ‌ట్టి.. ఒక‌రోజు ముందుగానే రాజ్‌భ‌వ‌న్‌లో ఉగాది సెల‌బ్రేష‌న్స్ నిర్వ‌హిస్తున్నార‌ని అంటున్నారు. కేసీఆర్ కోస‌మే వేడుక‌ల‌ను ఒక‌రోజు ముందుకు జ‌రిపార‌ని చెబుతున్నారు. గ‌వ‌ర్న‌ర్ ఇంత‌గా చొర‌వ తీసుకుని.. స్నేహ‌హ‌స్తం ముందుకు చాచితే.. మ‌రి, సీఎం కేసీఆర్ ఆ చేయి అందుకుంటారా? హ్యాండిస్తారా? అనే ఉత్కంఠ కొన‌సాగుతోంది. 

గ‌తంలో న‌ర‌సింహ‌న్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న‌ప్పుడు.. సీఎం కేసీఆర్ రాజ్‌భ‌వ‌న్‌కు రెగ్యుల‌ర్ విజిట‌ర్‌గా ఉండేవారు. ఊ అంటే ఉరికేవారు. వారిద్ద‌రి మ‌ధ్య మంచి బంధం, సంబంధం ఉండేది. త‌మిళ‌నాడు బీజేపీ ప్ర‌ధాన నేత త‌మిళిసై.. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా వ‌చ్చాక ప‌రిస్థితి మారిపోయింది. మొద‌ట్లో కాస్త బాగానే ఉన్న‌ట్టు అనిపించినా.. పాడి కౌశిక్‌రెడ్డిని గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీగా నియ‌మించ‌డానికి త‌మిళిసై స‌సేమిరా అన‌డంతో వారి మ‌ధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గ‌వ‌ర్న‌ర్ స్వ‌త‌హాగా ప‌లు స‌మీక్ష‌లు, స‌మావేశాలు నిర్వ‌హించ‌డం కేసీఆర్‌కు ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. ఇక అప్ప‌టి నుంచీ గ‌వ‌ర్న‌ర్‌ను లెక్క చేయ‌క‌పోవ‌డం స్టార్ట్ చేశారు ముఖ్య‌మంత్రి. 

జనవరి 26న రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్ డుమ్మా కొట్ట‌డం.. గణతంత్ర దినాన గ‌వ‌ర్న‌ర్‌ ప్రభుత్వ ప్రసంగ కాపీని పక్కన పెట్టి తన సొంత ప్రసంగాన్ని చదివారంటూ ప్రభుత్వ వర్గాలు ఆరోపించ‌డం క‌ల‌క‌లం రేపింది. సమ్మక్క- సారలమ్మ జాతరకు వెళ్లిన గవర్నర్‌కు ప్రభుత్వ అధికారులు ప్రొటోకాల్‌ పాటించకపోవడం చర్చనీయాంశమైంది. గవర్నర్‌ను ఆహ్వానించడానికి జిల్లా మంత్రి, కలెక్టర్‌ వెళ్లకుండా ప్రభుత్వమే అడ్డుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక‌, గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభించ‌డం.. ఇలా వ‌రుస ప‌రిణామాలు జ‌రిగిపోయాయి. రాజ్‌భ‌వ‌న్‌, ప్ర‌గ‌తి భ‌వ‌న్ మ‌ధ్య దూరం బాగా పెరిగింది. ఆ దూరాన్ని త‌గ్గించ‌డానికే అన్న‌ట్టు.. తాజాగా రాజ్‌భ‌వ‌న్‌లో జ‌రిగే ఉగాది వేడుక‌ల‌కు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై. 

ఇటీవల గవర్నర్‌ ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ.. ‘‘సీఎం నా ఆహ్వానాన్ని స్వీకరిస్తారని భావిస్తున్నా.. కొత్త సంవత్సరంలో కొత్త ఆరంభాన్ని ఆకాంక్షిద్దాం. సీఎం చాలాకాలంగా రాజ్‌భవన్‌కు రావడం లేదు. గ్యాప్‌కు నా వైపు నుంచి ఎలాంటి కారణాలు లేవు. విభేదాలన్నీ కనుమరుగు కావాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు. మ‌రి, గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానాన్ని ముఖ్య‌మంత్రి మ‌న్నిస్తారా? కేసీఆర్‌ రాజ్‌భవన్‌లో అడుగు పెడతారా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.