TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉదయనిథి స్టాలిన్ అరెస్టు.. సీఎం విజయ్ ది తొందరపాటా, పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీయా?

Published on: Wed Aug 5, 2026 2:49PM

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

తమిళనాడు రాజకీయం రసకందాయంలో పడింది.  డీఎంకే నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి  ఉదయనిధి స్టాలిన్‌ను చెన్నై పోలీసులు అరెస్టు చేయడం రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అరెస్టు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.   తంజావూరులో ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో  ఉదయ నిథి స్టాలిన్.. టీవీకే అధినేత, సీఎం  విజయ్, సినీ నటి త్రిషను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.

తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి  స్టాలిన్  సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు  తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. 

ఈ వ్యవహారంపై తెలుగు వన్ చానల్  డిబేట్ లో సీనియర్ జర్నలిస్టులు వీవీరావు, గోపీ..    ఉదయనిధి అరెస్ట్ వ్యవహారంలో విజయ్ ప్రభుత్వం   తొందరపాటుగా వ్యవహరించిందని అభిప్రాయపడ్డారు.  సభల్లో మాట్లాడే వ్యాఖ్యలను ఎదుర్కోవడానికి ప్రజాక్షేత్రం ఉండగా, అధికారాన్ని ఉపయోగించి తక్షణ  అరెస్టులకు పాల్పడటం విజయ్ రాజకీయ అనుభవ రాహిత్యానికి, అపరిపక్వతకు అద్దం పడుతోందని విశ్లేషించారు.

ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి వేధిస్తే, అది చివరికి బాధితుడికి రాజకీయంగా  సానుభూతి తెచ్చిపెడుతుందనడానికి చరిత్రలో అనేక ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో తమిళనాడులో కరుణానిధి అరెస్ట్ ఘటన, తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అరెస్టు పరిణామాలు వారికి ప్రజాదరణను పెంచాయన్నారు.  ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ విషయంలో కూడా విజయ్ ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగిందనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లి అంతిమంగా డీఎంకేకు ప్రయోజనం చేకూరుస్తుందని వీవీరావు చెప్పారు. 

మరోవైపు నటి త్రిష పేరును ఈ వివాదంలోకి లాగడం, టీవీకే కార్యకర్తలు తీవ్ర నిరసనలు వ్యక్తంచేయడం వివాదాన్ని మరింత రాజేసింది. కేవలం క్షమాపణలు డిమాండ్ చేయడమో లేదా రాజకీయంగా తిప్పికొట్టడమో చేయకుండా, ఇలా పోలీసు బలగాలను ఉపయోగించడం వల్ల ఉదయనిధి ప్రతిష్ట దెబ్బతినడం కంటే ఆయనకు మైలేజ్ పెరిగే అవకాశమే ఉందన్నారు.  

Udhayanidhi Stalin Arrest, Vijay Immature Politics, TVK vs DMK, Tamil Nadu Politics, Tone News News Analysis