TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఓపెక్ కూటమి నుంచి యూఏఈ నిష్క్రమణ

Published on: Wed Apr 29, 2026 8:28AM

అంతర్జాతీయ చమురు విపణిలో  సంచలన పరిణామం చోటుచేసుకుంది. చమురు ఎగుమతి దేశాల శక్తిమంతమైన కూటమి అయిన ఓపెక్ నుంచి యునైటెడ్ అరబ్  ఎమిరేట్స్ తప్పుకుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా చేసింది.  ఈ నిర్ణయం వచ్చే నెల 1  నుంచి అమలులోకి రానుంది. కేవలం ఓపెక్ మాత్రమే కాకుండా..  రష్యాతో కూడిన  ఓపెక్ ప్లస్  కూటమి నుంచి కూడా వైదొలగాలని యూఏఈ నిర్ణయించుకుంది.  

తమ దేశ దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలు,  ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ పేర్కొంది. గత కొంతకాలంగా చమురు ఉత్పత్తి కోటాలపై కూటమిలోని ఇతర సభ్యదేశాలతో..  ముఖ్యంగా సౌదీ అరేబియాతో యూఏఈకి విభేదాలు  కొనసాగుతున్నాయి. తమ దేశం చమురు ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుకున్నప్పటికీ..  కూటమి నిబంధనల వల్ల పూర్తిస్థాయిలో ఎగుమతులు చేయలేకపోతున్నామనే అసంతృప్తి కారణంగానే యూఏఈ ఈ నిర్ణయానికి వచ్చిందని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. 

యూఏఈ తన  ప్రయోజనాలకు అనుగుణంగా చమురు ఉత్పత్తిని స్వతంత్రంగా నిర్ణయించుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఇంధన అవసరాలు మారుతున్న తరుణంలో..  క్లీన్ ఎనర్జీ తదితర ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన నిధులను చమురు ఎగుమతుల ద్వారా గరిష్టంగా సంపాదించాలని చూస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  1967 నుంచి ఈ కూటమిలో సభ్యదేశంగా ఉన్న యూఏఈ.. ఇప్పుడు తన సొంత ఆర్థిక ఎజెండాకే ప్రాధాన్యత ఇస్తోంది.

ఈ నిష్క్రమణ వల్ల ఓపెక్ కూటమిలో సౌదీ అరేబియా ఆధిపత్యానికి గట్టి దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఓపెక్ దేశాల్లో మూడవ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉన్న యూఏఈ బయటకు రావడం వల్ల..  చమురు ధరలపై కూటమికి ఉండే పట్టు సడలడం అనివార్యం. హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు,  భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయం చమురు ధరల్లో ఒడిదుడుకులకు దారి తీస్తుందన్న ఆందోళన వ్యక్తమౌతోంది.  

భవిష్యత్తులో యూఏఈ తన చమురు ఉత్పత్తిని క్రమంగా పెంచుతూ మార్కెట్లోకి రానుంది. ఇది వినియోగ దేశాలకు ఊరటనిచ్చే విషయం అనడంలో సంందేహం లేదు. కాగా యూఏఈ నిర్ణయంపై ఎపెక్ కూటమిలోని ఇతర దేశాల స్పందన తెలియాల్సి ఉంది.