TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమరావతి వైసీపీ రైతులకు జగన్ మరణశాసనం!

Published on: Mon Apr 18, 2022 12:12PM

ఇంత కాలం తమ పార్టీకి కొమ్ము కాసిన రైతులే ఇప్పుడుఈ ప్రభుత్వంలో తాము బతికే పరిస్థితి లేదు, మరణించడానికి అనుమతి ఇవ్వండి అంటూ ఏకంగా గవర్నర్ కు లేఖలు రాశారంటే... వైకాపా ప్రభుత్వానికి అధికారంపై తప్ప ఎవరి బాగోగులపైనా శ్రద్ధ లేదని అవగతమౌతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ పార్టీకి చెందిన రైతులే గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇంతకీ వారెవరంటే....
గత తెలుగు దేశం ప్రభుత్వం విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి 33వేల ఎకరాలు సమీకరించింది. ఆ సమయంలో విపక్షంలో ఉన్న వైకాపా భూములు ఇవ్వొద్దంటూ రైతులను రెచ్చగొట్టింది. రైతులు భూ సమీకరణకు భూములు ఇవ్వకుండా ఉండేందుకు  వారి చెవిన ఇల్లు కట్టుకు నచ్చ చెప్పింది. కుదరని చోట కన్నెర్ర చేసి బెదరించింది. అయినా రైతులు భూ సమీకరణ వైపే మొగ్గు చూపారు. అయితే వైకాపాకు చెందిన కొందరు రైతులు మాత్రం తమ భూములు ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. అటువంటి వారి భూములన్నిటినీ గత ప్రభుత్వం క్రయ, విక్రయాలకు అవకాశం లేకుండా  యూ-1 జోన్ లో చేర్చింది. అంటే రిజర్వ్ జోన్ అన్నమాట. ఆ జోన్ లో ఉన్న భూములు అమ్మడానికి కానీ, కొనుగోలు చేయడానికి కానీ అవకాశం ఉండదు. సరే...వైకాపా అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయ్యింది.  జగన్ మాటలను నమ్మి తమ భూములు అప్పటి ప్రభుత్వానికి ఇవ్వకుండా భీష్మించిన రైతుల భూములు ఇప్పటికీ రిజర్వ్ జోన్ లోనే ఉన్నాయి. అంటే గత ఆరేళ్లుగా ఆస్తులు ఉండీ వాటిని అనుభవించలేని దుస్థితిలో రిజర్వ్ జోన్ రైతులు ఉన్నారన్నమాట. తాము నమ్మిన జగన్ అధికారంలోనికి వచ్చి కూడా తమ బాధలను పట్టించుకోవడం లేదన్న బాధను ఇంత కాలం పంటి బిగువున భరించిన ఆ రైతులు తాము మోసపోయామని ఇప్పటికి గ్రహింపునకు వచ్చారు. ప్రభుత్వంపై తిరుగు బావుటా ఎగుర వేశారు. కారుణ్య మరణ భిక్ష పెట్టమంటూ గవర్నర్ కు లేఖల రూపంలో వినతి పత్రాలు సమర్పించారు.

తాడేపల్లి, కలువకొలను, కుంచనపల్లి గ్రామాలకు చెందిన రైతులకు చెందిన 178 ఎకరాలు ఈ యూ-1జోన్ లో ఉన్నాయి. నాడు విపక్షంలో ఉన్న వైకాపాకు మద్దతుగా నిలిచిన ఈ రైతులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నాడు వారి వెన్నంటి ఉండి, భుజం  తట్టి ప్రోత్సహించిన మంగళగిరి ఎమ్మెల్యే ఇప్పుడు వారి కేసి కన్నెత్తి చూడటం లేదు. పన్నెత్తి పలకరించడం లేదు. న్యాయం చేయాలని కోరుకుంటున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. ఆందోళన శిబిరాల కేసి చూసే నాథుడే కనిపించడం లేదు. మరో వైపు  అమరావతి రైతుల శిబిరాలు పెద్ద సంఖ్యలో మద్దతు దారులతో కలకలలాడుతుంటే...వీరి శిబిరాలు వెలవెలబోతున్నాయి. తాము రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యామని మధన పడటం తప్ప ఏం చేయలేని పరిస్థితుల్లో యూ-1 జోన్ రైతులు ఉన్నారు.