TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో ఆరుకు పెరిగిన ఒమిక్రాన్ కేసులు.. న్యూ ఇయర్ వేడుకలతో టెన్షన్

Published on: Sun Dec 26, 2021 9:29AM

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్.. ఆంధ్రప్రదేశ్ లో క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో ఒమిక్రాన్ కేసులు నిర్దారణ కాగా.. తాజాగా మరో రెండు ఒమిక్రాన్‌ కేసులను అధికారులు గుర్తించారు. దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్ మీదుగా ప్రకాశం జిల్లాకు వచ్చిన 48 ఏళ్ల వ్యక్తి కి, యూకే నుంచి అనంతపురం వచ్చిన మరో వ్యక్తికి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు వెల్లడైంది. దీంతో ఏపీలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. అయితే వారి కుటుంబ సభ్యులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష లో నెగెటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఈనెల 18న యూకే నుంచి బెంగళూరు విమానాశ్రయం మీదుగా అనంతపురానికి వచ్చిన 51 ఏళ్ల వ్యక్తికి కొత్త వేరియంట్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. విదేశాల నుంచి జిల్లాకు వస్తున్న వారిపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా 20న సదరు వ్యక్తికి పరీక్షలు నిర్వహించారు. 21వ తేదీన ఫలితాలు రాగా.. కరోనా నిర్ధారణ అయింది. దీంతో జీనోమ్‌ పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని సీసీఎంబీకి నమూనాలు పంపారు. శనివారం అర్ధరాత్రి వెలువడిన ఫలితాల్లో ఆ వ్యక్తికి ఒమిక్రాన్‌ ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి, బాధితుడిని క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.  ఆ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారి వివరాలను సేకరించి పరీక్షలు చేస్తున్నారు వైద్య సిబ్బంది. 

ఏపీలో డిసెంబర్‌ 24న రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి కోనసీమ అయినవెల్లి మండలం నేదునూరిపాలెనికి చెందిన మహిళకు ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది. ఇటీవలే ఈ మహిళ కువైట్‌ నుంచి వచ్చింది. యూఏఈ నుంచి విశాఖ వచ్చిన 33 ఏళ్ల వ్యక్తికి ఓమిక్రాన్ నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యాధికారులు వెల్లడించారు. ఇద్దరిని క్వారెంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.అంతకు ముందు కెన్యా నుంచి తిరుపతి వచ్చిన 39 ఏళ్ల మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా నమోదైంది. కెన్యా నుంచి వచ్చిన మహిళ.. చెన్నై విమానాశ్రయం నుంచి తిరుపతికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు ఏపీకి 67 మంది విదేశాల నుంచి వచ్చారని వారిలో 12 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్టు ప్రభుత్వం పేర్కొంది.