అర గంటలో 2 టీకాలు.. తొమ్మిదో తరగతి విద్యార్థి గగ్గోలు..
Published on: Thu Jan 20, 2022 11:50AM
వ్యాక్సిన్ అంటేనే వామ్మో అంటున్నారు కొందరు. ఇప్పటికీ ఒక్క డోసు టీకా కూడా తీసుకోని వాళ్లు చాలామందే ఉంటారు. రెండో డోసు అవసరం లేదనుకునే వాళ్లూ ఎక్కువే. ఇక, వ్యాక్సిన్ కావాలంటూ ఆరాటపడే వారూ పెద్ద సంఖ్యలో ఉంటారు. లేటెస్ట్‌గా, వృద్ధులకు బూస్టర్ డోస్, పిల్లలకు ఫస్ట్ డోస్ ఇస్తుండటంతో.. చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
తొమ్మిదో తరగతి విద్యార్థికి అర గంటలో రెండు కొవిడ్ టీకాలు వేసిన ఘటన కలకలం రేపుతోంది. ఆ స్టూడెంట్ సోమవారం మొదటి డోసు టీకా వేయించుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్లకుండా పాఠశాల గేటు దగ్గర తిరుగుతున్నాడు. అతడిని చూసిన సిబ్బంది.. వ్యాక్సిన్ వేసుకోవడానికి భయపడుతున్నాడని భావించి.. ఆ పిల్లాడికి మాటలు చెప్పి మళ్లీ టీకా వేశారు.
వ్యాక్సిన్ వేయడం పూర్తయ్యాక కానీ.. ఆ విద్యార్థి నోరు విప్పలేదు. తాను కాసేపటి క్రితమే టీకా వేసుకున్నానని.. మీరు మళ్లీ ఇప్పుడు ఇంకో డోసు వేశారని.. ఏడుస్తూ చెప్పడంతో స్కూల్ సిబ్బంది అవాక్కయ్యారు. రెండు రోసులు వేసినందుకు ఆ పిల్లాడికి ఏమవుతుందోనని అంతా హడలిపోయారు.
మరి, టీకా తీసుకున్నానని ముందే చెప్పొచ్చుగా అని ఆ స్టూడెంట్‌ని అడిగితే.. ఏమో నాకేం తెలుసు.. రెండు డోసులు వెంటవెంటనే ఇస్తారని అనుకున్నా.. అని అమాయకంగా చెప్పడంతో మరింత ఖంగుతిన్నారు.
విషయం తెలిసి ఆందోళన చెందిన వైద్యులు, ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం నిలకడగానే ఉండటంతో.. ఇంటికి పంపించేశారు. పశ్చిమ బెంగాల్‌లోని దేబ్రాలోని అలోకా పాఠశాలలో జరిగిందీ ఘటన. ఆ స్టూడెంట్ పేరు.. సాథీదే.


