భలే మంచి ట్విస్ట్!

 

 

 

కాంగ్రెస్ పార్టీ నిర్మాతగా, కేంద్ర ప్రభుత్వ దర్శకత్వంలో, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, ఏపీ కాంగ్రెస్ ముఖ్య పాత్రధారులుగా గత కొంతకాలంగా ఏకపక్షంగా నడుస్తున్న ‘రాష్ట్ర విభజన’ డ్రామాలో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. నిజంగా రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ బొచ్చెలో రాయిపడటం ఖాయమని కొత్తగా బయటపడిన ఈ ట్విస్ట్ చెప్పకనే చెబుతోంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏమిటంటే, శ్రీశైలం ప్రాజెక్టు రాయలసీమకు చెందిన భూమిలోనే ఉందట.. అలాగే నాగార్జునసాగర్ ప్రాజెక్టు గుంటూరు జిల్లాకి చెందిన భూముల సర్వే నంబర్లలోనే ఉందట!

 

ఈ విషయాలను వెల్లడిస్తూ వచ్చిన వార్తల్లో పూర్తి వాస్తవాలు వుంటే మాత్రం  హైదరాబాద్ మాదే.. భద్రాచలం మాదే అని రెచ్చిపోతున్న విభజనవాదుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టే. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రను ఎడారి చేయాలన్న ఉద్దేశంలో ఉన్న విభజనవాదులు తాము తీసుకున్న గోతిలో తామే పడ్డట్టే! రెండు ప్రాజెక్టులూ సీమాంధ్ర భూముల్లోనే వుంటే ఇక తెలంగాణ  పరిస్థితి ఏమిటి? హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం కాబట్టి సర్వహక్కులూ మావేనని గొంతుచించుకుంటున్న విభజనవాదులు సీమాంధ్రలో అంతర్భాగంగా వున్న ప్రాజెక్టుల నుంచి నీళ్ళు ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు? మొత్తమ్మీద పరిస్థితులు చూస్తుంటే విభజనవాదుల నెత్తిన తెల్లగుడ్డపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.



హైదరాబాద్ యూటీ దిశగా పయనిస్తోంది. హైదరాబాద్ ఆదాయంలో సీమాంధ్రకు న్యాయమైన వాటా లభించే పరిస్థితులు ఏర్పడ్డాయి. భద్రాచలం నూటికి నూరుశాతం సీమాంధ్రకి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాముల అంశం తెరమీదకి వచ్చింది. ఇన్నాళ్ళూ అనాథలుగా అరణ్యరోదన చేసిన సీమాంధ్రులకు మంచి రోజులు వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు విభజన డ్రామా రసకందాయంలో పడింది. ఇక ఈ డ్రామా దర్శక నిర్మాతలు, ప్రధాన పాత్రధారులు ఎలా స్పందిస్తారో చూడాలి.