ఢిల్లీ టూ ఝార్ఖండ్.. కేసీఆర్ ఢిల్లీ టూర్‌లో కొత్త ట్విస్ట్..
Published on: Fri Mar 4, 2022 10:19AM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ యాత్ర, ‘దిగ్విజయం’ గా సాగుతోంది. కేసీఆర్ ఢిల్లీలో కాలు పెట్టగానే, అయన కలుద్దామనుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఢిల్లీ వదిలి బెంగుళూరు వెళ్ళారు. నాలుగు రోజులు అయినా ఇంకా రాలేదు. అలాగే, ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ సొంత నియోజక వర్గం వారణాశి వెళ్లి, మమతా బెనర్జీ’తో కలిసి సమాజ్ వాదీ పార్టీ తరపున, ఎన్నికల ప్రచారం చేయాలనుకున్నారని వార్తలొచ్చాయి. సమాజ్ వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వద్దన్నారో, మమతా బెనర్జీనే కాదన్నారో తెలియదు కానీ, వారణాశి యాత్ర కూడా, డామిట్ కథలా అడ్డం తిరిగింది. కేసీఆర్ వారణాసి వెళ్ళలేదు. నిజానికి ముఖ్యమంత్రి ఢిల్లీ బయలు దేరిన సమయంలో, తెరాస నాయకులు చాలా చాలా లీకులు ఇచ్చారు. కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ఇంకా వాళ్ళు వీళ్ళు చాలామంది నాయకులను కలుస్తారని ప్రచారం జరిగింది. అయితే, చివరకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి, రైతు నేత టికాయత్‌లతో మాత్రమే కేసీఆర్ సమావేశమయ్యారు. నిజానికి, ఆ ఇద్దరికీ, కేసీఆర్ ఢిల్లీ వెళ్ళిన అసలు (ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే) పనికి ప్రత్యక్షంగా సంబంధం లేదు.
అదలా ఉంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఝార్ఖండ్ వెళుతున్నారు. అయితే ఇది పొలిటికల్ ట్రిప్ కాదు. నిజమే, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ తో కేసీఆర్’ కు మంచి సంబంధాలే ఉన్నాయి.అయితే, సోరెన్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అందించే ఆక్సిజన్ అవసరం. కాంగ్రెస్ మద్దతు లేకుంటే సోరెన్ ప్రభుత్వం కూలి పోతుంది. సరే అది వేరే విషయం నుకోండి..
అదలా ఉంచి విషయంలోకి వస్తే చైనా సరిహద్దులోనీ గల్వాన వాలీలో 2020 జూన్ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్బాబు సహా మనదేశానికి చెందిన 20 మంది సైనికులు వీరోచితంగా పోరాడి అమరులయ్యారు.సంతోష్ బాబుతో పాటు అమరులందరికీ తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. 2020 జూన్ 19న ప్రధానమంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ మేరకు పరిహారం ప్రకటించారు. సంతోష్ బాబుకు ఐదు కోట్ల రూపాయలు, మిగతా 19 మంది సైనికుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఆర్థికసాయాన్ని ప్రకటించారు. గతంలోనే సూర్యాపేటలోని సంతోష్బాబు ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పరిహారంతో పాటు సంతోష్బాబు సతీమణికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. గల్వాన్ లోయలో చనిపోయిన జవాన్లలో ఇద్దరు ఝార్ఖండ్ వాసులు ఉన్నారు. వారికి నష్టపరిహారం ఇచ్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి రాంచీ వెళ్లి ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ తో కలిసి, వారి అధికారిక నివాసం లో రూ.10 లక్షల చెక్కులను జార్ఖండ్ కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు అంద చేస్తారు.
అయితే, ఈసమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఝార్ఖండ్ వెళుతోంది, అందుకోసమేనా లేక వేరే కారణం ఉందా అన్న అనుమానాలు అయితే, లేక పోలేదు. వీర వీరజవాన్ల కుటుంబాలకు అర్తిక సహాయం అందచేయడం ఎవరూ తప్పు పట్టరు .కానీ, సమయ సందర్భాలను బట్టి అనుమానాలు వ్యక్తంవుతున్నాయని అంటున్నారు.రాష్ట్రంలో ఒక మంత్రి హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై రాజకీయ దుమారం చెలరేగుతున్న సమయంలో, ముఖ్యమంత్రి ఢిల్లీ మకాం చేయడం, అదే సమయంలో బడ్జెట్ కసరత్తు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి న్డుబతులో లేక పోవడం, అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. ఏమైనా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ యాత్ర రాజకీయ ఆసక్తిని అయితే రేకెత్తిస్తోంది..


