TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తమిళనాట విజయ్‌కు పెరుగుతున్న రాజకీయ మద్దతు!

Published on: Thu May 7, 2026 4:14PM

మెజార్టీకి అవసరమైన మద్దతు కూటగట్టుకుంటామని, ప్రమాణస్వీకారానికి అనుమతి ఇవ్వాలని టీవీకే అధినేత విజయ్ తమిళనాడు గవర్నర్‌ను కోరితే.. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ ప్రస్తుతం టీవీకే వద్ద లేదని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ స్పష్టం చేస్తూ అనుమతి తిరస్కరించారు. ఆ క్రమంలో విజయ్‌కు రాజకీయ మద్దతు పెరుగుతూ.. , రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.

విజయ్ నేతృత్వంలోని టీవీకే సింగిల్ లార్జెస్ట్  పార్టీగా అవతరించినప్పటికీ..  ప్రభుత్వ  ఏర్పాటు   విషయంలో గవర్నర్ కార్యాలయం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.

మరోవైపు, అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధినేత విజయ్‌కే ప్రభుత్వం ఏర్పాటు చేసే మొదటి అవకాశం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో..  ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం విజయ్ మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చారనీ,  మరే ఇతర కూటమి  కోరనప్పుడు గవర్నర్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని.. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం గవర్నర్ వ్యవస్థను వాడుకుంటోందని సీపీఎం తీవ్రంగా ఆరోపించింది.  విజయ్‌కు కేవలం సీపీఎం మాత్రమే కాకుండా, ఇతర పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. సీపీఐ, వీసీకే పార్టీలు కూడా ప్రజా తీర్పును గౌరవించి విజయ్‌కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..  తమిళనాడు ప్రజల తీర్పును గౌరవించాలని హితవు పలికింది. మరో వైపు డీఎంకే కూడా కొత్త పార్టీ ప్రభుత్వ ఏర్పాటునకు తాము అడ్డపడబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు డీఎంకే అధినేత స్టాలిన్ స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రజా తీర్పును తాము శిరసావహిస్తామని, అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామన్న వార్తలు పూర్తిగా నిరాధారమని కొట్టి పారేశారు.