ఎట్టకేలకు పోలీసుల ఎదుట హాజరైన రవిప్రకాష్
Published on: Tue Jun 4, 2019 5:17PM

సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ మంగళవారం నాడు హాజరయ్యారు. 41 ఏ నోటీసు కింద పోలీసుల విచారణకు హాజరుకావాల్సిందేనని సోమవారం నాడు సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో ఇవాళ రవిప్రకాష్ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు.
సొంత ప్రయోజనం కోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారంటూ టీవీ9 యాజమాన్యం రవిప్రకాష్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదుచేసిన సైబర్ క్రైమ్ పోలీసులు విచారణకు హాజరుకావాల్సిందిగా రవిప్రకాష్‌కు పలుమార్లు నోటీసులు జారీచేశారు. రవిప్రకాష్ పోలీసుల ఎదుట హాజరుకాకపోగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇదే సమయంలో అజ్ఞాతంలో ఉంటూనే ముందస్తు బెయిల్ కోరుతూ రవిప్రకాష్ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు. అక్కడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. రవి ప్రకాష్ పోలీసు విచారణకు హాజరుకావాల్సిందేనని సుప్రీంకోర్టు సైతం ఆదేశించింది. దీంతో రవిప్రకాష్ నేడు సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.


