టీవీ 9 హవాలా గుట్టు రట్టు.. ఉగ్రవాదులతో లింక్ ఉన్న నెట్ వర్క్!!

 

ఫోర్జరీ కేసు, టీవీ 9 లోగో అమ్మకం ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సిఈవో రవిప్రకాష్ తెలంగాణ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. దురుద్దేశాలతో ప్రభుత్వం తనను వేధిస్తోందంటూ హైకోర్టుకు నివేదించారు. గతంలో టీవీ 9 ఏర్పాటు సమయంలో మారిషస్‌ నుంచి ఫెమా నిబంధనలకు విరుద్ధంగా రూ. 60 కోట్ల నిధులు వచ్చాయని ప్రస్తుతం టీవీ 9లో వాటాను విక్రయించిన సందర్భంలో కూడా హవాలా మార్గాల్లోనే నిధులు తరలించారని ఆరోపిస్తూ ఆయన కోర్టుకు నివేదించారు. సాధారణంగా మారిషస్ లాంటిదేశాల నుంచి ఇండియాలోకి వచ్చే సొమ్ము ఏదైనా ఉందా అంటే.. అది ఇండియాలో అక్రమంగా సంపాదించిన సొమ్మును హవాలా మార్గంలో తరలించి.. మళ్లీ అధికారికంగా ఇండియాలోకి పంపించుకుంటూ ఉంటారు. టీవీ 9 విషయంలో ఇదే జరిగిందని ఆయన కోర్టు సాక్షిగా బయటపెట్టారు.

టీవీ9 అమ్మకం వ్యవహారంలో కూడా రూ. 294 కోట్ల నగదు చేతులు మారిందని, ఈ లావాదేవీ పూర్తిగా నగదు రూపంలో హవాలా మార్గంలో నడిచిందని రవి ప్రకాష్ ఆరోపించారు. అంతేకాదు.. ఉగ్రవాదులకు నిధులు సరఫరా చేసే హవాలా నెట్‌వర్క్ ద్వారా నిధులు తరలించారని సంచలన ఆరోపణలు చేసారు. టీవీ9 కొనుగోలు, నిధుల తరలింపుపై దర్యాప్తు చేయాలంటూ సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లకు తాను ఇటీవల ఫిర్యాదు చేశానని, అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం తనను వెంటాడుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు తనను తప్పుడు కేసులతో అరెస్ట్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.