TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీవీ 18 చేతుల్లోకి..అమ్మేసిన ఈటీవీ చానెళ్లు

Published on: Wed Jan 4, 2012 7:28AM

ముంబయి:  మీడియా దిగ్గజం రామోజీ గ్రూపునకు చెందిన ఈటీవీ న్యూస్ చానళ్ల అమ్మకానికి కొంతకాలంగా జరుగుతున్న ప్రయత్నాలు మంగళవారం కొలిక్కివచ్చాయి. ఈనాడు టీవీ చానళ్లను కొనుగోలు చేయడానికి ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్), బిజినెస్ న్యూస్ చానళ్లను నడుపుతున్న నెట్‌వర్క్ 18 సంస్థ సుమారు 4వేల కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఈటీవీ న్యూస్ చానళ్లలో వందశాతం, ఈటీవీ ఎంటర్‌టైన్‌మెంట్ చానళ్లలో 50 శాతం, ఈటీవీ తెలుగు, ఈటీవీ-2 న్యూస్ చానళ్లలో 24.5 శాతం వాటాలను 2100 కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు టీవీ18 బ్రాడ్‌కాస్ట్ లిమిటెడ్ (టీవీ18) డైరెక్టర్ల బోర్డు మంగళవారం ఆమోదం తెలిపింది. కొనుగోలుకు సంబంధించిన న్యాయపరమైన ఒప్పందాలపై త్వరలోనే సంతకాలు జరుగుతాయి. కాగా, ఈటీవీ చానల్స్‌లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాలను కొనుగోలు చేయడానికి టీవీ18 నెట్‌వర్క్‌కు అవసరమైన నిధులను ఆర్‌ఐఎల్ వేరుగా ఏర్పాటు చేసిన స్వతంత్ర ట్రస్టు సమకూరుస్తుంది. ఇందుకోసం టీవీ18 సంస్థ రైట్స్ జారీ చేస్తుంది. ఈనాడు గ్రూపునకు చెందిన వివిధ చానళ్లలో తమకు సుమారు 2600 కోట్ల రూపాయల విలువైన వాటాలున్నట్టు ఆర్‌ఐఎల్ ఇప్పటికే ప్రకటించింది.

నాలుగు ప్రాంతీయ చానళ్లు (ఈటీవీ ఉత్తరప్రదేశ్, ఈటీవీ మధ్యప్రదేశ్, ఈటీవీ బీహార్, ఈటీవీ ఉర్దూ), అయిదు ఎంటర్‌టైన్‌మెంట్ చానళ్లు (ఈటీవీ మరాఠీ, ఈటీవీ కర్నాటక, ఈటీవీ బంగ్లా, ఈటీవీ గుజరాత్, ఈటీవీ ఒరియా), రెండు తెలుగు చానళ్లు ఈటీవీ తెలుగు, ఈటీవీ తెలుగు న్యూస్ చానళ్లలో 49శాతం వాటాలు ఆర్‌ఐఎల్‌కు ఉన్నాయి. ఈ ఒప్పందం ప్రకారమైతే అయిదు ప్రాంతీయ న్యూస్ చానళ్లలో వందశాతం, తెలుగు కాకుండా మిగిలిన ఎంటర్‌టైన్‌మెంట్ చానళ్లలో 50 శాతం, తెలుగు చానళ్లలో 24.5 శాతం వాటాలను టీవీ18 తీసుకుంటుంది. దీంతో ఈటీవీ న్యూస్ చానళ్లు, తెలుగు చానళ్లు కాకుండా మిగతా ఎంటర్‌టైన్‌మెంట్ చానల్స్‌పై టీవీ18కు మేనేజిమెంట్ హక్కులు లభిస్తాయి. అయితే ఆర్‌ఐఎల్ నిధులు సమకూర్చడం వల్ల టీవీ18 ప్రమోటర్, మేనేజిమెంట్ లేదా ఎడిటోరియల్ కంట్రోల్‌లో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదని ఈ రెండు గ్రూపులు ప్రకటించాయి. ఈ ఒప్పందంలో భాగంగా టీవీ18 నెట్‌వర్క్‌కు చెందిన అన్ని మీడియా, వెబ్ ఆస్తులను, ప్రోగ్రామ్‌లు, ఇతర డిజిటల్ సమాచారాన్ని ప్రసారం చేసేందుకు ఆర్‌ఐఎల్ అనుబంధ సంస్థ అయిన ఇన్ఫోటెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్ లిమిటెడ్‌తో టీవీ18 నెట్‌వర్క్ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది కూడా. దక్షిణ భారతదేశంలో ప్రధాన నెట్‌వర్క్‌లలో ఒకటైన ఈటీవీ జాతీయ స్థాయిలో అత్యధికులు వీక్షించే నెట్‌వర్క్‌లలో అయిదోస్థానంలో ఉంది.