పొలాల్లో దిగిన విమానం

 

22 సంవత్సరాల క్రితం... అంటే నవంబర్ 15, 1993లో ఆంధ్రప్రదేశ్‌లోని వెంకటగిరి సమీపంలో ఒక విమానం పొలాల్లో దిగిన విషయం గుర్తుండే వుంటుంది. ఆ విమానంలో చిరంజీవి, బాలకృష్ణ, విజయశాంతి, రామానాయుడు, ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఇప్పుడు నేపాల్‌లో అలాంటి ఘటనే జరిగింది. టర్కీ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఒక విమానం గాల్లో వుండగా, నేపాల్ ప్రాంతానికి వచ్చేసరికి విపరీతమైన పొగమంచులోకి ప్రవేశించింది. విమానం పైలెట్‌కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దాంతో పైలెట్ విమానాన్ని ఖాట్మండూ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ లాండింగ్ చేసేశాడు. ఎయిర్‌పోర్టులో లాండ్ అయిన విమానం రన్ వే మీద ఆగకుండా అలాగే ముందుకు వెళ్ళిపోయింది. ఆ పరిస్థితి చూసి విమానం పేలిపోవడం ఖాయమని విమానంలోని ప్రయాణికులతో సహా అందరూ అనుకున్నారు. అయితే ప్రయాణికుల అదృష్టం బాగుండి రన్ వే దాటిన తర్వాత వున్న పొలాల్లోకి విమానం దూసుకుపోయింది. దాంతో విమానంలో ప్రయాణిస్తున్న 227 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. కొంతమంది ప్రయాణికులకు స్వల్వ గాయాలు అయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది నిజంగా మిరకిల్ అని, ఈ విమానంలోని ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారంటే వారికి ఇంకా ఈ భూమ్మీద నూకలు ఉన్నందువల్లనే అని ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన ఖాట్మండూ విమానాశ్రయ అధికారులు అంటున్నారు.