ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్ట్‌పై ఉగ్రపంజా

టర్కీలోని ప్రముఖ పట్టణం అటాటర్క్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై ఉగ్రవాదులు పంజా విసిరారు. ముగ్గురు ఉగ్రవాదులు విమానాశ్రయంలోకి చోరబడి ప్రవేశద్వారం వద్ద కాల్పులు జరిపి ఆ తర్వాత తమని తాము పేల్చేసుకున్నారు. ఈ దాడిలో 36 మంది మరణించగా..150 మందికి పైగా గాయపడ్డారు. ఉగ్రవాదులు ఎయిర్‌పోర్ట్‌లోకి చొరబడటాన్ని గమనించిన భద్రతా దళాలు వారిని పట్టుకునేలోపే ఘోరం జరిగిపోయింది. మృతుల్లో టర్కీ వాసులతో పాటు విదేశీయులు కూడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఐసిస్ ఉగ్రవాదులే దాడులకు పాల్పడి ఉంటారని టర్కీ ప్రధాని బినాలీ ఇల్దిరిం తెలిపారు. టర్కీ దాడులను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్, భారత ప్రధాని నరేంద్రమోడీ ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు.