టీఆర్ఎస్ గెలుపు.. తెర వెనుక తుమ్మల..!

ఎంతో రసవత్తరంగా సాగిన జీహెచ్ఎంసీ ఎన్నికలు ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. నగరంలోని ప్రజలంతా ఊరు పార్టీకే పట్టంగట్టారు. టీఆర్ఎస్ పార్టీ కూడా ఊహించనంతగా 150 డివిజన్లలో 99 స్థానాలు గెలుపొంది.. మిగిలిన పార్టీలను పత్తా లేకుండా చేసింది. అయితే ఈ ఎన్నికల్లో ఈ ప్రాంతానికి చెందిన వారు ఎలాగూ అధికార పార్టీకే ఓటు వేస్తారు. అది పక్కా.. అది అందరికి తెలిసిన రహస్యమే. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సీమాంధ్రుల ఓట్లు కూడా టీఆర్ఎస్ పార్టీకే వెళ్లడం. అయితే సెటిలర్ల ఓట్లు పక్కా తమకే పడతాయనుకున్న మిగిలిన పార్టీలకు షాకిస్తూ ఆ ఓట్లను కూడా టీఆర్ఎస్ ఖాతాలో వేసుకుంది. మరి సెటిలర్లు కూడా టీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపడానికి కారణం ఏంటి.. కేటీఆర్ మాటలకు సీమాంధ్ర ప్రజలు ఇంప్రెస్ అయ్యారా.. అంటే దీనంతటికి తెర వెనుక మరో వ్యక్తి ఉన్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆవ్యక్తి ఎవరో కాదు.. టీడీపీ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన తుమ్మల నాగేశ్వరరావు.

తుమ్మల నాగేశ్వరరావు మొదటి నుండి టీడీపీ పార్టీలోనే ఉండేవారు. అయితే రాష్ట్ర విభజన జరిగిన అనంతరం.. ఆయన పార్టీ మారి కారెక్కవలసి వచ్చింది. ఇప్పుడు ఈ తుమ్మలతోనే సెటిలర్లపై మంత్రం వేయించారంట కేసీఆర్. నగరంలో అన్ని చోట్లా కేటీఆర్ ప్రచారం చేసినా సెటిలర్ల విషయంలో మాత్రం తుమ్మలని రంగంలోకి దించారంట. అది టీఆర్ఎస్ పార్టీకి ఫ్లస్ పాయింట్ అయింది అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎందుకంటే తుమ్మలకి సెటిలర్లలో మంచి పేరు.. మంచి పట్టు ఉంది. అంతేకాదు తుమ్మల మాటపై ఉన్న నమ్మకం.. తుమ్మల ఏంచెప్పినా సెటిలర్లు కాదనే నమ్మకం ఉంది. అందుకే సెటిలర్లపై తుమ్మల చేత బాణాలు వేయించారు కేసీఆర్. అంతేకాదు సెటిలర్లను తమకు అనుగుణంగా మార్చడంలో తుమ్మల నూరుశాతం విజయం సాధించినట్టు తెలుస్తోంది. దీనికి నిదర్శనం ఆ ప్రాంతంలో కూడా టీఆర్ఎస్ గెలవడమే.

మొత్తానికి తెర ముందు కేటీఆర్.. తెర వెనుక తుమ్మల కలిసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. దీంతో కేసీఆర్ కూడా తుమ్మలకి ప్రత్యేకంగా అభినందనలు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ లో తుమ్మలకి ప్రాధాన్యత పెరగడమే కాదు.. ఆయనకు ప్రమోషన్ కూడా ఉంటుందని అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు.