TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏడు కొండల వాడి దర్శనం కోసం భక్తుల పాట్లు.. గందరగోళం సృష్టిస్తున్న టీటీడీ ఫీట్లు

Published on: Mon May 30, 2022 8:03AM

తిరుమల తిరుపతి దేవస్థానం తీరు భక్తులను అయోమయానికి గురి చేస్తున్నది. టీటీడీ ఈవో ఏమో రద్దీ తగ్గేంత వరకూ తిరుమల రావద్దంటూ భక్తులకు సూచిస్తారు. మరో వైపు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి మాత్రం భక్తులను రావద్దని టీటీడీ ఎప్పుడూ చెప్పదనీ, ఎంత రద్దీ ఉన్నా భక్తులకు సౌకర్యాల కల్పనకు వెనుకాడబోమనీ చెబుతున్నారు. రద్దీ అధికంగా ఉన్న మాట వాస్తవమేనన్న సుబ్బారెడ్డి దర్శనానికి 48 గంటలు పడుతోందని చెప్పారు.

క్యూలైన్లలో ఉన్న భక్తులకు మంచినీరు, ఆహారం అందిస్తున్నామనీ, వచ్చిన భక్తులందరూ శ్రీవారి దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు. అయితే టీటీడీ భక్తుల రద్దీని తట్టుకోలేక చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తున్నది. గంటలకు శ్రీవారి క్యూలైన్లలోకి ఎనిమిది వేల మంది వస్తుంటే.. గంటలకు నాలుగు వేల మంది మాత్రమే శ్రీవారి దర్శనం చేసుకోగలుగుతున్నారు. అంతకు మించి భక్తులకు దర్శనం కల్పించలేమని టీటీడీ చెబుతోంది. గతంలో రోజులు లక్షల మంది భక్తులు వచ్చినా సజావుగా దర్శనాలు జరిగేవి. అయితే ఇటీవలి కాలంలో టీటీడీ భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో విఫలమౌతోంది.

ఎన్నడూ లేని విధంగా క్యూలైన్లలో తొక్కిసలాటలు జరుగుతున్నాయి. కాటేజీలు దొరక్క భక్తులు నానా ఇబ్బందులూ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు ప్రకటించినా సామాన్య భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కలగడం గగన మౌతోంది. ఈ పరిస్థితుల్లో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ అధికంగా ఉన్నందున మరి కొన్ని రోజుల వరకూ భక్తులెవరూ తిరుమల రావొద్దని టీటీడీ ఈవో స్వయంగా ప్రకటించారు. దీంతో సర్వత్రా నిరసనలు వ్యక్తం అవ్వడంతో నష్టనివారణకు రంగంలోనికి దిగిన సుబ్బారెడ్డి.. భక్తులు తిరుమలకు రావొద్దని టీటీడీ ఎన్నడూ చెప్పదని వివరణ ఇచ్చారు.

శ్రీవారి దర్శనం జాప్యం అవుతుందని మాత్రమే చెప్పామనీ, తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేలా చూడటమే తమ లక్ష్యమని సుబ్బారెడ్డి చెప్పారు. అయితే తిరుమల కొండపై భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ విఫలమైందన్న విమర్శలు వినవస్తున్నాయి. సామాన్య భక్తులకు సౌకర్యాల కల్పన కంటే.. సిఫారసులు, వీఐపీల సేవలకే టీటీడీ అధిక ప్రాధాన్యత ఇస్తోందని భక్తులు విమర్శిస్తున్నారు.