సామాన్య భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్...రూ.10 వేలు చెల్లిస్తే వీఐపీ దర్శనం !

 

ఏడుకొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు భక్తుల కొంగుబంగారం. కోరిన కోరికలను నెరవేర్చే తిరుమల వెంకన్న స్వామిని జీవితంలో ఒక్కసారైనా కనులారా దర్శించాలని ఆశించని భక్తులు ఉండరు. అయినా ఎన్ని వ్యయ ప్రయాసలు కోర్చి క్యూలో నిల్చుని స్వామి సన్నిధికి చేరుకున్నా సెకన్లపాటు ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని చూసే భాగ్యం కొందరికి దక్కదు. అటువంటి సందర్భాల్లో అంత కష్టపడి కొండ ఎక్కినా వారు తీవ్ర నిరాశతో తిరుగుముఖం పడతారు. 

అటువంటి సమస్య లేకుండా సామాన్య భక్తులకు కూడా టీటీడీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే ఎల్ 1, ఎల్2, ఎల్3 వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టీటీడీ సామాన్య భక్తులకు శ్రీవారి వీఐపీ దర్శనం కల్పించేలా కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఏ సిఫార్సు లేకుండానే సామాన్య భక్తులకు వీఐపీ టికెట్లు కేటాయించనుందని అంటున్నారు. ఇప్పటి వరకు వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను సిఫార్సు లేఖలపైనే జారీ చేస్తోంది. 

అంతేకాక శ్రీవారికి రూ.10 లక్షలకు పైగా విరాళం ఇచ్చిన భక్తులకు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు అందిస్తోంది. కానీ ఇకనుండి టీటీడీ శ్రీవాణి పథకానికి రూ.10వేలు విరాళంగా అందజేసిన భక్తులకు కూడా వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు కేటాయించే యోచనలో ఉన్నట్టు టీటీడీ ఈవో సింఘాల్ ప్రకటించారు. శ్రీవాణి పథకానికి వచ్చే నిధులతో దేశవ్యాప్తంగా వేంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మిస్తోంది టీటీడీ. తాజా నిర్ణయంతో ఈ పథకానికి నిధులు వెల్లువెత్తుతాయని భావిస్తున్నారు టీటీడీ అధికారులు.