టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు భక్తులు సహకరించాలి: టీటీడీ ఈవో సింఘాల్​

ప్రతిరోజూ 'కరోనా' పరిస్థితిపై సమీక్షిస్తున్నాం
శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం లేదు
భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం
రేపటి నుంచి శ్రీవారి ఏకాంత సేవలు నిర్వహిస్తాం

'కరోనా' కలకలం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీసుకున్న నిర్ణయాలకు భక్తులు సహకరించాలని  ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. తిరుమలలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతిరోజూ 'కరోనా' పరిస్థితిపై సమీక్షిస్తున్నామని చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం లేదని, భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని స్పష్టం చేశారు. రేపటి నుంచి శ్రీవారి ఏకాంత సేవలు నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టీటీడీ విద్యాసంస్థలను మూసివేశామని చెప్పారు.  

తిరుమలలో ఇవాళ కోవిడ్–19 లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్న అరవై ఐదేళ్ల భక్తుడు దయాశంకర్ ని గుర్తించామని, స్విమ్స్ కు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ కు చెందిన దయాశంకర్ తో పాటు నూల పది మందికి పైగా యాత్రికులు ఈ నెల 11న తీర్థయాత్రకు బయలుదేరారని చెప్పారు. ఈ క్రమంలోశ్రీశైలం వెళ్లి అక్కడి నుంచి తిరుమలకు వచ్చారని చెప్పారు.