టీటీడీ సంచలన నిర్ణయం.. శ్రీవారి ఆస్తుల వేలం...

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని 23చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించాలని నిర్ణయించింది. ఇప్ప‌టికే టీటీడీ పాల‌క‌మండ‌లిలో ఈ మేర‌కు తీర్మానం జరిగింది. దీని కోసం 8 కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఆస్తుల విక్రయానికి బహిరంగ వేలం నిర్వహించాలని నిర్ణయించారు. బ‌హిరంగ వేలం ద్వారా అమ్మిన ఆస్తుల‌ను రిజిస్ట్రేషన్‌ చేసే అధికారాలను టీటీడీ అధికారులకు కట్టబెట్టారు.

ఈ ఆస్తుల నిర్వహణ భారంగా మారిందనే పేరుతో ఆస్తులు విక్రయించాలని నిర్ణయించారు. ఇవన్నీ వివిధ సందర్భాలలో స్వామి వారి భక్తులు విరాళంగా ఇచ్చినవి. ఇందులో వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు ఉన్నాయి. కాగా, ఈ అమ్మకాలకు సంబంధించిన తతంగమంతా టీటీడీ ఇప్పటికే పూర్తి చేసింది. ఇప్పుడు అధికారికంగా ఉత్తరువులు కూడా వచ్చాయి. ఓ వైపు ఏపీలో ప్రభుత్వ భూముల అమ్మకాలే వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు శ్రీవారి ఆస్తులు అమ్మకానికి పెట్టడం సంచలనంగా మారింది. టీటీడీ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ ఆస్తులను తమవారికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తక్షణం ఆస్తుల విక్రయాన్ని నిలిపివేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.