TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీటీడీ చైర్మన్ గిరి వద్దంటున్న వైవీ! జగన్ తో విభేదాలే కారణమా.. 

Published on: Thu Jun 3, 2021 8:29PM

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి జగన్ కు గతంలో సన్నిహితంగా ఉన్న నేతలంతా ఆయనకు దూరమయ్యారని తెలుస్తోంది. వైసీపీ టాప్ లీడర్లలో ఒకరిగా చెప్పుకునే ఎంపీ విజయసాయి రెడ్డితో సీఎం జగన్ కు గ్యాప్ బాగా పెరిగిందంటున్నారు. కొన్ని రోజులుగా సాయి రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి రావడం లేదని చెబుతున్నారు. తనపై నిఘా పెట్టారనే మనస్తాపంతో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా.. జగన్ తో క్లోజ్ గా ఉండటం లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. తాజాగా మరో సీనియర్ నేత కూడా జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న పదవి రెన్యూవల్ కు కూడా ఆ నేత ఇష్టపడటం లేదని సమాచారం. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కీలక నేతగా ఉన్నారు వైవీ సుబ్బారెడ్డి. జగన్ జైలులో ఉన్న సమయంలో పార్టీ వ్యవహారాలు చక్కబెట్టడంతో ఆర్థిక వనరులను వైవీనే సమకూర్చారని చెబుతారు. 2014లో ఒంగోలు నుంచి ఎంపీగా గెలిచారు సుబ్బారెడ్డి. ప్రస్తుతం ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‍గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన పదవీ కాలం మరి కొద్దిరోజులలో ముగియనుంది. అయితే తనకు టీటీడీ ఛైర్మన్‍ పదవి పొడిగింపు అవసరం లేదని వైవీ సుబ్బారెడ్డి... ముఖ్యమంత్రి జగన్ కు చెప్పారని అంటున్నారు. తాను పార్టీ కార్యకర్తగానే కొనసాగుతానని కూడా స్పష్టం చేశారట. టిటిడి ఛైర్మన్‍గా మరో రెండేళ్లు కొనసాగినా చేసేది ఏమీ లేదని.. రాజకీయంగా ఇప్పటికే దెబ్బ తిన్నానని.. వైవి సుబ్బారెడ్డి తన సన్నిహితులతో తెర వెనుక చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు వైసీపీలో సెగలు రేపుతోంది. 

వైవీ సుబ్బారెడ్డి బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేయడానికి రాజకీయ కారణాలు ఉన్నాయంటున్నారు. 2014 ఎన్నికలలో తాను ఎంపీగా ఒంగోలు నుండి విజయం సాధించినప్పటికీ.. 2019లో మళ్లీ ఆయనకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. అప్పటికప్పుడు పార్టీలో చేర్చుకున్న మాగంటి శ్రీనివాసరెడ్డికి జగన్‍ రెడ్డి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. జగన్ తీరుపై అప్పుడో వైవీ తీవ్రంగా వ్యతిరేకించారని సమాచారం. అయితే కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని.. వైవీని కూల్ చేశారని చెబుతున్నారు. తర్వాత టీటీడీ చైర్మెన్ పదవి ఇవ్వడంతో ఆయన శాంతించారు. ఇటీవల కాలంలో పార్టీలో తన ప్రాధాన్యత తగ్గడంతో వైవీ సుబ్బారెడ్డి మళ్లీ అలక బూనారని చెబుతున్నారు.

మరోవైపు వైసీపీ వర్గాలు మాత్రం సీఎం జగన్ తో వైవీ సుబ్బారెడ్డికి ఎలాంటి విభేదాలు లేవని చెబుతున్నారు.  2022 మార్చిలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలలో తనకు రాజ్యసభ సీటు కావాలని సుబ్బారెడ్డి అడుగుతున్నారని, జగన్ కూడా హామీ ఇవ్వడంతో టీటీడీ చైర్మన్ పదవి రెన్యూవల్ కోరుకోవడం లేదని అంటున్నారు.