TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జోక్యం చేసుకోండంటూ కేంద్రానికి టీటీడీ లేఖ.. ఏ విషయంలోనో తెలుసా?

Published on: Mon Mar 3, 2025 2:39PM

తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా కేంద్రానికి ఒక లేఖ రాసింది. ఆ లేఖలో తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో జోక్యం చేసుకోవాలని కోరింది. ఆగండాగండి.. తిరుమలపై పెత్తనాన్ని టీటీడీ ఈ లేఖ ద్వారా కేంద్రానికి గంపగుత్తగా ఇచ్చేస్తోందన్న అనుమానాలను దరి చేరనీయకండి. ఇంతకీ టీడీటీ ఏ విషయంలో తిరుమల పవిత్రతను కాపాడండంటూ కేంద్రానికి లేఖ రాసిందో తెలుసా? ఆ విషయానికే వస్తున్నా..

ఇటీవలి కాలంలో ఆగమశాస్త్రానికి విరుద్ధంగా తిరుమల కొండపై నుంచి విమానాల రాకపోకలు ఎక్కువయ్యాయి. గతంలో ఎప్పుడో ఓ సారి పొరపాటున జరిగిందనిపించేలా  సాగిన ఈ విమానాల చక్కెర్ల వ్యవహారం.. వైసీపీ హయాంలో తరచుగా జరిగే తంతుగా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి  అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఇది ఆగలేదు. తిరుమల కొండపై విమానాలు ఎగరడం ఆగమశాస్త్ర విరుద్ధమంటూ పండితులు పదేపదే చెబుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. అసలింతకీ తిరుమలను కేంద్ర విమానయాన శాఖ నో ఫ్లై జోన్ గా ప్రకటించిందా? లేదా అన్నవిషయంపై కూడా క్లారిటీ లేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రానికి లేఖ రాసింది. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా తిరుమల కొండపై విమానాలు తిరగడాన్ని నిషేధించాలనీ, ఇందుకు అవసరమై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కేంద్రాన్ని కోరింది. 
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటోంది. అవి సత్ఫలితాలను ఇస్తున్నాయి కూడా.

జగన్ హయాంలో తిరుమల పవిత్రత మంటగలిసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అన్యమత ప్రచారం నుంచి, పారిశుద్ధ్యం వరకూ, లడ్డూ ప్రసాదం  నుంచి అన్న ప్రసాదం నాణ్యత వరకూ నాణ్యతా లోపం ప్రస్ఫుటమైంది. కొండపై పారిశుద్ధ్యం అధ్వాన స్థితికి చేరుకుంది. తెలుగు దేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలి సారిగా తిరుమలేశుని దర్శనానికి వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల కొండపై నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానని అన్నారు. అన్న మాట ప్రకారం తిరుమల పవిత్రతను పెంచే దిశగా పలు చర్యలు తీసుకున్నారు.

ఆ చర్యలలో భాగంగానే తిరుమల కొండపై విమానాలు చక్కర్లు కొట్టడాన్ని నియంత్రించాలని కోరతూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి లేఖ రాశారు. ఆ లేఖలో తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కోరారు. ఈ లేఖపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.