TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గ్రీన్ జోన్‌గా తిరుమల.. అలిపిరి వరకు  గరుడ వారధి

Published on: Sat Jun 19, 2021 4:33PM

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలను గ్రీన్ జోన్‌గా  ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తిరుమలకు 100 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించిందని, భవిష్యత్తులో తిరుమలకు కేవలం ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడుపుతామని టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. శనివారం జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. తిరుమలలోని అనధికారిక దుకాణాలను వారం రోజుల్లో తొలగిస్తామన్నారు  వైవీ సుబ్బారెడ్డి. చిన్నపిల్లల ఆస్పత్రికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రాంతాల్లోటీటీడీ కల్యాణ మండపాలను నిర్మిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 

సెప్టెంబర్ నెలలోపు టీటీడీలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయడానికి కమిటీని ఏర్పాటు చేశామని వైవీ చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులను ఆలయాల నిర్మాణానికి వెచ్చిస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ మత్స్యకార కాలనీల్లో రాబోయే ఏడాది కాలంలో 500 ఆలయాలను నిర్మిస్తామని చెప్పారు. ధర్మప్రచారంలో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆలయాలను నిర్మిస్తున్నామన్నారు. జమ్మూలో 62 ఎకరాల్లో నిర్మిస్తున్న టీటీడీ శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. త్వరలోనే ముంబై, వారణాసిలో కూడా ఆలయాల నిర్మాణం చేపడతామని చెప్పారు. గుడికో గోమాత కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా 100 ఆలయాలకు గోవులను అందించామని చెప్పారు. 

వరాహస్వామి ఆలయానికి బంగారు తాపడం, వాకిలికి వెండి తాపడం చేయిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గోవిందుడికి గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన బియ్యంతోనే నైవేధ్యం సమర్పిస్తున్నామని చెప్పారు. గత రెండు నెలల్లో అనేక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పిన వైవీ సుబ్బారెడ్డి.. హనుమంతుడి జన్మస్థలం తిరుమలగా తీర్మానం చేశామని గుర్తు చేశారు. ఆకాశగంగ ప్రాంతాన్ని దశల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు. గరుడ వారధిని అలిపిరి వరకు నిర్మిస్తామని చెప్పారు. తిరుమలలో ప్లాస్టిక్‌ను బ్యాన్ చేసిన విషయాన్ని టీటీడీ ఛైర్మెన్  గుర్తు చేశారు.