15 ఏళ్లలోపు పిల్లలకు బస్సులో ఫ్రీ.. ఆర్టీసీ కానుక
Published on: Sun Nov 14, 2021 12:42PM
బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ చిన్నారులకు మంచి కానుక అందించింది. 15 ఏళ్లలోపు పిల్లలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. దీనికి సంబంధించి ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఆర్టీసీకి చెందిన ఏసీ, మెట్రో, డీలక్స్, ఆర్డినరీ.. ఇలా ఏ బస్సులోనూ చిన్నారులకు టికెట్ అవసరం లేదని సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అయితే ఆ ఆఫర్ బాలల దినోత్సవం ఒక్క రోజు మాత్రమే వర్తించనుంది.
ఐపీఎస్ అధికారి అయిన సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమంతో పాటు సంస్థను లాభాల బాట పట్టించేందుకు చర్యలు చేపట్టారు. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందేలా ఏర్పాట్లు చేశారు. ప్రజలు కూడా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సజ్జనార్. ఇటీవలే పెండ్లి కోసం ఆర్టీసీ బస్సును బుక్ చేసుకోగా.. ఆ వివాహానికి హాజరై సర్ ఫ్రైజ్ ఇచ్చారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.


