గొట్టంగాడు పిలిస్తే కేటీఆర్ వస్తాడా! రెచ్చిపోయిన మంత్రి 

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ పెరిగిపోయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఎక్కువ మంది నిరుద్యోగులే ఉండటంతో.. వారి చుట్టే రాజకీయం తిరుగుతోంది. ఉద్యోగాల భర్తీపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఉద్యోగాలు భర్తీ చేయలేదంటూ తమ ప్రభుత్వంపై విపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు కేటీఆర్. గత ఆరేండ్లలో భర్తీ చేసిన ఉద్యోగ వివరాలతో గురువారం కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. కేటీఆర్ లేఖపై స్పందించిన కాంగ్రెస్ నేతలు.. ఉద్యోగ భర్తీలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. టీకాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ గన్ పార్క్ వద్ద బైఠాయించి.. కేటీఆర్ ను చర్చకు రావాలని సవాల్ చేశారు. ఉద్యోగాల లెక్కల్లో తప్పులున్నాయి కాబట్టే.. చర్చకు రావడం లేదని కేటీఆర్ పై మండిపడ్డారు. 

కాంగ్రెస్ నేత శ్రవణ్ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎవడు పడితే వాడు గన్ పార్క్ వద్ద చర్చకు రమ్మంటే కేటీఆర్ వస్తాడా? అని వ్యాఖ్యానించారు. చర్చకు రమ్మని అడగడానికి ఓ స్థాయి ఉండాలని అన్నారు. కేటీఆర్ పై వ్యాఖ్యలు చేసేవాళ్లు తమ స్థాయి తెలుసుకుని మాట్లాడాలని మంత్రి తలసాని హితవు పలికారు. గత ప్రభుత్వాలు ఉద్యోగాల కల్పనలో విఫలమైతే, టీఆర్ఎస్ ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్పారు. 

హైదరాబాదులోని సనత్ నగర్ లో టీఆర్ఎస్ పార్టీ నేతలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు తలసాని.