ఇవెక్కడి బది’లీలలు’.. గురువుల ఆగ్రహం ..
Published on: Mon Dec 27, 2021 3:56PM
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మార్గదర్శకాలు జారీ చేసింది. క్రతువు మొదలైంది. ఉద్యోగుల సంగతి ఎలా ఉన్నా ఉపాధ్యాయులు మాత్రం బదిలీలలకు ఇది సమయం కాదంటున్నారు. ఈ సమయంలో బదిలీలు చేపడితే ఇప్పటికే అంతంత మాత్రంగా, వానా కాలం చదువుల్లా సాగుతున్నకరోకా కాలం చదువుల బోధన ఇంకు కుంటూ పడుతుందని, విద్యార్ధులు నష్ట పోతారని ఉపాద్యాయులు, తల్లితండ్రులు కూడా, ఆందోళన వ్యక్తపరుస్తున్నారు.
బదిలీ ప్రక్రియ, విధి విధానాలు, కొత్త పాత జిల్లాలు, సీనియారిటీ ఇలా అనేక విషయాల్లో తమకు అన్యాయం జరుగుతోందని,ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్త పరుస్తున్నాయి. అలాగే, జిల్లా, క్యాడర్ కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేయాలని డిమాండ్ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. విద్యాసంత్సరం మధ్యలో టీచరు మారితే పిల్లలు నష్టపోతారంటున్నారు. వేసవిసెలవుల్లో బదిలీలు, పోస్టింగ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సీనియారిటీ జాబితాను సమగ్రంగా తయారు చేయకుండా, జిల్లా కేటాయింపులో జరిగిన అవకతవకలను సరిచేయకుండా కొత్త జిల్లాలకు పోస్టింగ్ ఇవ్వటమేమిటని ప్రశ్నిస్తున్నారు. పదోన్నతుల తర్వాతనే బదిలీలు చేపడితే బాగుంటుందంటున్నారు. 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం తాంబూలాలు ఇచ్చేశాం, తన్నుకు చావండి అన్నట్లుగా వ్యవహరిస్తోంది. అధికారులు చెప్పిందంతా వింటున్నారు .. చివరకు పై వారికో చెప్పుకోండని అంటున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
రాష్ట్రం మొత్తంలో 25 వేల మంది వరకు ఉపాధ్యాయులు బదిలీలపై వెళ్లనున్నారని సమాచారం. నిజానికి గతంలో అయితే, బదిలీలు.. పదోన్నతులు అంటే టీచర్ల సంఘాల నాయకులకు, టీచర్ ఎమ్మెల్సీలకు చేతినిండా పనుండేది. ఇప్పుడు అదేమీ లేదు ఉపాధ్యాయ సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం అసలు గుర్తిస్తున్నట్లే లేదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ వంతు పాత్రను పోషించిన ఉపాధ్యాయ సంఘాలు ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యమై పోయాయనే మాట వినవస్తోంది. రాష్ట్రంలో 50 వరకు ఉపాధ్యాయ సంఘాలున్నాయి. ఉపాద్యాయ ఎమ్మెల్సీలున్నారు.అయితే, ప్రభుత్వం ఎవరినీ సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటోందని, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న గౌరవం కూడా సొంత రాష్ట్రంలో లేకుండా పోయిందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు వాపోతున్నారు.
ఇతర విషయాలు ఎలా ఉన్నా మరో రెండు మూడు మాసాల్లో విద్యా సంవత్సరం ముగుస్తున్న సమయంలో, ఉపాధ్యాయుల బదిలీ చేయడం ఏమిటని తల్లితడ్రులు కూడా, అభ్యంతరం వ్యక్త పరుస్తున్నారు. సహజంగా విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత వేసవి సెలవల్లో ఉపాధ్యాయుల బదిలీలు చేపడతారు. కానీ, ఈ సంవత్సరం అందుకు విరుద్ధంగా, విద్యాసంవత్సరం ముగింపుకు వచ్చిన సమయంలో బదిలీల తేనెతుట్టెను కదల్చడం వలన విద్యార్ధులు నష్ట పోతారని, ఉపాధ్యాయులు, విద్యార్ధులు, తల్లి తండ్రులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. అందుకే వేసవిసెలవుల్లో బదిలీలు, పోస్టింగ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
నిజానికి ప్రస్తుత విద్యాసంవత్సరం చాలా వరకు అస్తవ్యస్తంగానే సాగింది. కొవిడ్ కారణంగా విద్యా క్యాలెండర్ వంకర్లు పోయింది. సగం సాలి నేత సగం మాల నేత అన్నట్లుగా, సగం ఆన్లైన్ క్లాసులు, సగం ప్రత్యక్ష తరగతులు జరగడంతో, అటు ఉపాధ్యాయులు ఇటు విద్యార్ధులు తల్లితండ్రులు గందరగోళంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో బది’లీలలు’ మొదలైతే.. పరిస్థితి మరింతగా దిగజారుతుందని అంటున్నారు. ఇప్పటికే ఫస్ట్ ఇయర్ ఇంటర్ పరీక్షల విషయంలో ప్రభుత్వం తప్పులో కాలేసి అప్రతిష్ట పాలైంది. కాబట్టి అనవసర బేషజాలకు పోకుండా ప్రభుత్వం బదిలీలు, పదోన్నతుల షెడ్యూలుపై పునరాలోచన చేయాలని అంటున్నారు.


