హైదరాబాద్ లో రెండు ఇళ్లున్నాయి.. జాగ్రత్త! నానికి తెలంగాణ మంత్రి వార్నింగ్
Published on: Mon Jun 28, 2021 7:24PM
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పోటాపోటీగా హాట్ కామెంట్లు చేస్తూ కాక రేపుతున్నారు. కృష్ణా జలాల అంశంలో ఏపీ సీఎం జగన్ తో పాటు దివంగత వైఎస్సార్ ను తెలంగాణ మంత్రులు టార్గెట్ చేస్తున్నారు. వైఎస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ నేతలకు కొందరు ఏపీ మంత్రులు కౌంటరిచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్.
ఏపీ మంత్రి నానికి హైదరాబాద్‌లో రెండు ఇళ్లు ఉన్నాయని, ఇక్కడ వ్యాపారం చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన కనీసం ఆలోచించి మాట్లాడాలి కదా అని ప్రశ్నించారు. సి.రామచంద్రయ్య కూడా వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడొద్దన్నారు. ఇక్కడ తింటూ అక్కడి మాట మాట్లాడితే ఇక్కడి ప్రజలు మీ గురుంచి ఆలోచన చేస్తే పరిస్థితి ఏంటి? అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
తమ పదవులు పోయినా, ప్రాణాలు పోయినా ఏపీ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టును అడ్డుకుంటామని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే బతుకులు బాగుపడతాయని ప్రజలు ఆశతో ఉన్నారన్నారు. ఆ ఆశలకు గండికొడుతూ జగన్ ప్రభుత్వం వరద జలాల పేరుతో నికర జలాలను తరలిస్తోందని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తున్నారని తెలిపారు. కృష్ణా రివర్ బోర్డ్ రాయలసీమ ప్రాజెక్టును ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. హైడల్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని మాకు ఎలా ఆదేశాలు ఇస్తారని శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు.


