TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సినీ ఫక్కీలో వాహనాన్ని ఛేజ్ చేసి పట్టుకున్న మంత్రి

Published on: Tue May 25, 2021 10:14AM

అతనో మంత్రి... కాన్వాయ్ లో వెళుతున్నారు.. అతని కళ్లు ముందే ఓ ప్రమాదం జరిగింది.  ఓ బైకును ఢీకొట్టిన వాహనం... ఆగకుండా అలాగే స్పీడుగా వెళుతోంది. ఇది గమనించిన సదరు మంత్రి.. తన వాహనాన్ని స్పీడ్ పెంచాలని డ్రైవర్ ను ఆదేశించారు. సినీ ఫక్కీలో ఆ వాహనాన్ని ఛేజ్ చేశారు. ప్రమాదం చేసి పరారవుతున్న వాహనం డ్రైవర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రమాదంలో గాయపడిన బైకిస్టుకు మెరుగైన చికిత్స అందేలా మంత్రి చర్యలు తీసుకున్నారు. 

సినీ ఫక్కీలో వాహనాన్ని ఛేజ్ చేసి పట్టుకున్న ఆ మంత్రి.. తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.  మంత్రి కాన్వాయ్ హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వస్తోంది. రాజాపూర్ సమీపంలో ముదిరెడ్డిపల్లికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు బాలానగర్ నుంచి సొంతూరుకు బైక్ పై వస్తున్నాడు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి కర్ణాటక వెళుతున్న బొలెరో వాహనం రాజాపూర్ శివారులో బైక్‌ను ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది. అప్పుడు అటుగా వస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన వాహనాన్ని వేగంగా ముందుకు తీసుకుపోమని డ్రైవర్‌ను ఆదేశించారు. బైక్‌ను ఢీకొట్టి తప్పించుకునే ప్రయత్నం చేసిన బొలెరో వాహనాన్ని ఛేజ్ చేసి 3 కిలోమీటర్ల లోపే పట్టుకున్నారు. మంత్రి వాహనాన్ని అడ్డంగా పెట్టి బొలెరో వాహనాన్ని ఆపారు. అనంతరం యాక్సిడెంట్ చేసి పరారవుతున్న కర్ణాటకకు చెందిన బొలెరోడ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

ప్రమాదంలో గాయపడిన శ్రీనివాస్‌ను రాజాపూర్ పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స చేసి మహబూబ్ నగర్‌కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాద్‌కు పంపించారు. తన కళ్ల ముందే ప్రమాదాన్ని చూసి వెంటనే మానవత్వంతో స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ వల్లే బాధితునికి వెంటనే చికిత్స అందింది. తప్పుచేసిన డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారని స్థానికులు తెలిపారు. మంత్రి సాయానికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.