వరి నిషేదిత జాబితాలో ఉందా..! సిద్దిపేట కలెక్టర్ పై హైకోర్టు సీరియస్..
Published on: Wed Nov 3, 2021 4:16PM
వరిని పడ్డించవద్దంటూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు అగ్గి రాజేస్తున్నాయి. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. యాసంగిలో వరి విత్తనాలు అమ్మితే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణహైకోర్టు మండిపడింది. వరి విత్తనాలను నిషేధిత జాబితాలో ఏమైనా చేర్చారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. జిల్లా మెజిస్ట్రేట్ గా ఉండి చట్టాన్ని పరిరక్షించాల్సిన అధికారే.. చట్టవిరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది.
ఇటీవల విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి. వరి విత్తనాలను అమ్మవద్దంటూ వారికి ఆదేశాలు జారీ చేశారు. అమ్మినట్టు తెలిస్తే సీజ్ చేస్తానని హెచ్చరించారు. వరి విక్రయించిన దుకాణాలను తెరవాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా తాను లెక్కచేయనని కలెక్టర్ అన్నారు. దీనిపై సిద్దిపేట జిల్లాకు చెందిన రైతు బత్తుల నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వరి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.
పిటిషనర్ తరఫున న్యాయవాది చిన్నోళ్ల నరేష్‌రెడ్డి వాదనలు వినిపించారు. కలెక్టర్ వ్యాఖ్యలు కోర్టుధిక్కరణ కిందకే వస్తుందని వాదించారు. వరి విత్తనాలు విక్రయించరాదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదని ఏజీ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కామెంట్లు కోర్టుధిక్కరణ కిందకే వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు వెంకట్రామిరెడ్డిపై క్రిమినల్ కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తిని కోరుతూ న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్‌కుమార్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.
‘జిల్లా మెజిస్ట్రేట్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయం. చట్టానికి అతీతులు ఎవరూ కాదు. కోర్టులు ఆదేశించినా లెక్క చేయనని పేర్కొనడం క్రిమినల్ కోర్టుధిక్కరణ కిందకే వస్తుంది. భవిష్యత్తులో కలెక్టర్‌కు ఏదైనా సమస్య వచ్చినా న్యాయస్థానాన్నే ఆశ్రయించాల్సి ఉంటుంది’అని న్యాయమూర్తి గుర్తుచేశారు. కలెక్టర్‌పై తదుపరి చర్యల కోసం ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.


