TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డ్ర‌గ్స్ కేసులో సీఎస్ సోమేశ్‌కుమార్‌కు హైకోర్టు నోటీసులు.. రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్‌!

Published on: Thu Apr 7, 2022 1:11PM

ఇటీవ‌లే ఏపీలో 8 మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష విధిస్తూ క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంది హైకోర్టు. ఆ త‌ర్వాత ఆ ఉన్న‌తాధికారులంతా వేడుకోవ‌డంతో.. జైలు శిక్ష‌ను సేవా శిక్ష‌గా స‌వ‌రించి కాస్త ఊర‌ట నిచ్చింది. తాజాగా, తెలంగాణ‌లోనూ అలాంటి ప‌రిణామాలే జ‌ర‌గ‌నున్నాయా? అనే అనుమానం క‌లుగుతోంద‌ని అంటున్నారు. తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌కు టీఎస్ హైకోర్టు కోర్టు ధిక్క‌ర‌ణ నోటీసులు జారీ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో ఇలాంటి ఉత్త‌ర్వులు రావ‌డం మ‌రింత క‌ల‌క‌లం రేపుతోంది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.... 
  
టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సీఎస్‌ సోమేశ్ కుమార్‌, ఎక్సైజ్‌ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ ఆరోపణలపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.   

డ్రగ్స్‌ కేసులో నిందితుల కాల్‌ డేటా, డిజిటల్‌ రికార్డులు ఇవ్వట్లేదని ఈడీ గతంలో ఆరోపించింది. హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం స్పందించట్లేదని తెలిపింది. సీఎస్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌పై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ఈడీ పిటిషన్‌ దాఖలు చేయ‌గా.. తాజాగా వారిద్ద‌రికీ నోటీసులు జారీ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. 

టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో ఈడీ జోక్యాన్ని కోరుతూ గ‌తంలో రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిష‌న్ వేయ‌గా.. అప్ప‌టి నుంచీ డ్ర‌గ్స్ కేసుపై ఈడీ విచార‌ణ వేగంగా జ‌రుగుతోంది. కానీ, ద‌ర్యాప్తున‌కు స‌ర్కారు స‌హ‌క‌రించ‌డం లేదంటూ ఈడీ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తోంది. అయినా, ప్ర‌భుత్వం నుంచి కావల‌సినంత స‌మాచారం అంద‌క‌పోవ‌డంతో.. ఇక ఉపేక్షించేది లేదంటూ హైకోర్టులో కోర్టు ధిక్క‌ర‌ణ పిటిష‌న్ వేసింది ఈడీ. ఆ మేర‌కు సీఎస్ సోమేశ్ కుమార్‌తో పాటు ఎక్సైజ్ డైరెక్ట‌ర్ స‌ర్ప‌రాజ్‌కు న్యాయ‌స్థానం నోటీసులు ఇష్యూ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.